వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; లోతైన దర్యాప్తు

25 Oct, 2018 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. ఎవరు బాధ్యులో గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి సూచించినట్టు వెల్లడించారు.

వైఎస్‌ జగన్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణ జరిపి దోషిని శిక్షిస్తామన్నారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని ఆదేశించామని, విచారణ జరుగుతోందని సురేశ్‌ ప్రభు ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సురేశ్‌ ప్రభు అదనంగా పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు మార్చిలో విమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. 

మరిన్ని వార్తలు