ఇందూరు ఎన్నికలపై అనుమానాలు: అరవింద్‌

16 Apr, 2019 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల తీరుపై అక్కడి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను సోమవారం ఆయన సచివాలయంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమాచార హక్కు చట్టం కింద నిజామాబాద్‌ లోక్‌సభ పోలింగ్‌కు సంబంధించిన వివరాలను అందజేయాలని సీఈఓను కోరారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద తమ పార్టీ ప్రతినిధులను కాపలా పెట్టుకోవడానికి అనుమతించాలని కోరగా, సీఈఓ సానుకూలంగా స్పందించారు.

సమావేశం అనంతరం అరవింద్‌ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌ శాతంతో పాటు పలు అంశాలపై సమాచారం అందించాలని ఆర్టీఐ కింద సీఈఓకు దరఖాస్తు చేశామని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందజేస్తామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత కొన్ని యంత్రాలు ఆలస్యంగా స్ట్రాంగ్‌ రూమ్‌కు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశామని తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, అక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని సీఈఓ హామీ ఇచ్చారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు