నీతి, జాతి లేకుండా విమర్శలా: తలసాని

9 Oct, 2017 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీతి, జాతి, ఎజెండా లేకుండా అన్ని పార్టీలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుళ్లు, కుతంత్రాలతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనపై కేసీఆర్‌ దృష్టి పెట్టారని, 1.15 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 20 వేల ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. సన్నబియ్యంతో విద్యార్థులకు అన్నం పెట్టిన చరిత్ర దేశంలోనే లేదని, కులవృత్తుల మీద ఆధారపడిన వారికి సహకారం అందిస్తున్నామని తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో అంబర్‌పేటలో ఎలా గెలుస్తారో చూస్తామని హెచ్చరించారు. కోదండరాం నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు. జానారెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఆయన స్థాయి ఏమిటో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. 

మరిన్ని వార్తలు