గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

1 Sep, 2019 13:18 IST|Sakshi

తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై

విద్యార్థిని దశ నుంచే బీజేపీలో గుర్తింపు

పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ ఓటమే

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడుకు చెందిన బీజేపీ నేత డా.తమిళసై సౌందర్‌రాజన్‌ (58) తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు. తమిళనాడులో బీజేపీ కీలక నేతగా వ్యవహరిస్తున్న తమిళసై.. ప్రస్తుతం ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైద్య వృత్తి నుంచి వచ్చిన తమిళిసై అనతికాలంలోనే బీజేపీ మహిళా అగ్రనేతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోలి గ్రామంలో 1961 జూన్‌2న కుమారి అనంతన్‌, కృష్ణ కుమారి దంపతులకు తమిళిసై జన్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ 2నే ఆమె జన్మదినం కావడం విశేషం. సౌందర్‌రాజన్‌ మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. అనంతరం కొంత కాలంపాటు వైద్యురాలిగా సేవలందించారు. ఆమె భర్త సౌందర్‌రాజన్‌ కూడా తమిళనాడులో ప్రముఖ వైద్యుడే.

కార్యకర్త నుంచి పార్టీ చీఫ్‌గా..
సౌందర్‌రాజన్‌ తండ్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. కుటుంబమంతా కాంగ్రెస్‌ పార్టీతో కొనసాగినప్పటికీ.. తమిళసై మాత్రం భిన్నంగా బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో మద్రాస్‌ మెడికల్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లో విద్యార్థిని నాయకురాలుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి అనేక పదవుల్లో పార్టీకి సేవలందించారు. 1999లో సౌత్‌ చెన్నై జిల్లా విద్యా విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత 2007 పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైయ్యారు.

చదవండి: తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌

అన్నింటా ఓటమే..
సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం సౌందర్‌రాజన్‌కు రాలేదు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజాయాన్ని చవి చూశారు. అనంతరం 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే నేత కనిమొళిపై పోటీ చేసి 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు