సబ్బం హరికి అసమ్మతి సెగ

19 Mar, 2019 21:06 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అధికార టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సబ్బం హరి పేరు ఖరారు చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సబ్బం హరికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత కోరాడ రాజబాబుతో సహా పలువురు నేతలు మంగళవారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరకుండానే అధిష్ఠానం సబ్బం హరికి టికెట్ ఇవ్వడం దారుణమని టీడీపీ నాయకులు వాపోతున్నారు.

బాబూరావు గరం గరం
కనిగిరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కదిరి బాబురావు టీడీపీ అధిష్టానంపై రగిలిపోతున్నారు. పార్టీకి సేవ చేసిన తనను పక్కన పెట్టి టీడీపీకి ఏమాత్రం సంబంధం లేని ఉగ్రనరసింహరెడ్డికి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి దర్శికి వెళ్లేది లేదని బాబూరావు తెగేసి చెప్తున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాబురావుకి కనిగిరి టికెట్ ఇవ్వాల్సిందే అని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

సీఎం నివాసం వద్ద నిరసన జ్వాలలు
అమరావతిలోని సీఎం నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. మాచర్ల  టిక్కెట్‌ అంజిరెడ్డికి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసానికి భారీగా తరలివచ్చి నిరసన చేపట్టారు. అంజిరెడ్డికి సీటు ఇస్తే నామినేషన్ వేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తే పార్టీ కోసం కష్ట పడిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు