డాక్టర్‌కు ఆక్రమణ రోగం

3 Apr, 2019 10:20 IST|Sakshi
టీడీపీ నేతల ఆధీనంలో ప్రభుత్వ, డీకేటీ భూములు, అందులో దేవాలయం నిర్మించేందుకు ఏర్పాట్లు చేసిన సామగ్రి

సాక్షి, కడప/చింతకొమ్మదిన్నె : కడప రింగురోడ్డుకు దక్షిణం, పడమర వైపు చింతకొమ్మదిన్నె మండలం విస్తరించి ఉంది. రింగురోడ్డు చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తారంగా జరుగుతోంది. ఈక్రమంలో చింతకొమ్మదిన్నె భూములకు భారీగా విలువ పలుకుతోంది. కడప–చిత్తూరు జాతీయ రహదారిలో రైల్వే ఫై ఓవర్‌ బ్రిడ్జి పూర్తి కావస్తోంది. ఈదశలో భూముల ధరలకు మరింతగా రెక్కలొస్తున్నాయి. ఈనేపథ్యలో ఇక్కడి డీకేటీ భూములను రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి మార్చి లబ్ధిపొందాలని  నగరంలోని ప్రముఖ వైద్యుడు యోచించారు. తనసొంత మండలమైన చింతకొమ్మదిన్నెలో ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజస్కందాలపై వేసుకుంటానని.. ల్యాండ్‌ కన్వర్షన్‌ పని చేయిం చాలని అక్కడి టీడీపీ అభ్యర్థితో  ఆ డాక్టరు ఒప్పందం కుదుర్చుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఈ షరతుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌కు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని ఆ అభ్యర్థి హామీ ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా డాక్టరు చింతకొమ్మదిన్నె టీడీపీ ప్రచార బాధ్యతల్ని  భుజానికెత్తుకున్నారు. 

మూలవంక  భూములపై కన్ను....
కడప–చిత్తూరు జాతీయ రహదారిపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) పూర్తవుతోంది. ఇక్కడ భూముల రేట్లు  పెరిగిపోయాయి. ఇదే అదునుగా భావించిన ఒక వైద్యుడు టీడీపీ నేతలతో ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల్లో అనుకూలంగా పనిచేస్తా, భూ బదలాయింపు చేయించాలని షరతు పెట్టి సఫలమయ్యారు. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామ పొలంలో సర్వే నంబర్‌ 716లో 3.22 సెంట్లు, 718–1లో 2.73 సెంట్లు, 718–2లో 1.95 సెంట్లు, 719లో 5.04 సెంట్లు, 720–1లో 1.41 సెంట్లు, 720–2లో 4.95 ఎకరాల డీకేటీ భూమిని గుర్తించారు. 2003లో  ప్రభుత్వం ఈ భూమిని విద్యాసంస్థల కోసం దరఖాస్తు చేసుకున్న బుఖారియా ఎడ్యుకేషనల్‌ సొసైటీకి కేటాయించింది.

సదరు సొసైటీ అందులో విద్యాసంస్థలు ఏర్పాటు చేయలేదు. అసైన్‌మెంటు ద్వారా సంక్రమించిన భూములను విద్యాసంస్థల అధినేతలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడీ భూములపై నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడి కన్ను   పడింది. మూలవంక సమీపంలో ఉన్న భూములను కూడా కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవాలని ఆయన పథకం వేశారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ఎత్తుగడ వేశారు. ఎప్పటికైనా సమస్యగా తలెత్తే అవకాశముందని పనిలో పనిగా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయించాలని యోచించారు. ఇందుకోసం ఇక్కడి టీడీపీ అభ్యర్ధితో అవగాహనకు వచ్చారు. తనకు పట్టున్న సొంత మండలంలో ప్రచార బాధ్యతల్ని నిర్వర్తించినందుకు గాను ఆ భూములకు సంబంధించి ల్యాండ్‌ కన్వర్షన్‌ పని చేయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే కిందిస్థాయి రెవెన్యూ అధికారులతో ఆయన మంతనాలు సాగించారు. ఫైలు కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. స్థలంలో ముందుగా దేవాలయం నిర్మించాలని అడుగులు వేసినట్లు తెలుస్తోంది. స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా విరమించినట్లు సమాచారం. 

టీడీపీ ముమ్మర ప్రచారంలో వైద్యుడు...
కడప నగరంలో ప్రముఖ వైద్యుడుగా గుర్తింపు ఉన్న చింతకొమ్మదిన్నె మండలవాసీ టీడీపీ ముమ్మర ప్రచారంలో పాల్గొంటున్న తీరు చర్చనీయాంశమైంది. మండలంలో అధికార పక్షానికి అన్నీ తానై ఆయన వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థికి మండలంలో మెజార్టీ తెప్పించే బాధ్యత తనదేనని బాహాటంగా చెబుతున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయడం, వైఎస్సార్‌సీపీలోకి మారేవారిపై ఒత్తిడి తేవడం లాంటి చర్యలకు ఆయన పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి కంటే ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్న డాక్టరు తీరు అక్కడివారికి విస్మయం కలిగిస్తోంది. దీని వెనుక డీకేటీ భూముల బదలాయింపు ఒప్పందమే కారణమని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు