ఓట్ల తొలగింపుతో టీడీపీ చిల్లర రాజకీయాలు

17 Oct, 2018 03:31 IST|Sakshi
సీఈవోకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి

ప్రతి నియోజకవర్గంలో దాదాపు 5 వేల ఓట్లు తొలగింపునకు కుట్ర

సీఈవోకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు

ఓట్ల తొలగింపునకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని వినియోగిస్తున్నారు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీకి అనుకూలురైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తూ టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఓట్లు తొలగింపు ద్వారా అడ్డదారిలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సిసోడియాను మంగళవారం గోపిరెడ్డి కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 4 వేలు ఓట్లు తొలగించడానికి సిద్ధమయ్యారని ఈ సందర్భంగా చెప్పారు. ఇలా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ అనుకూలుమైన నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు తొలగించడానికి టీడీపీ కుట్ర చేస్తోందన్నారు.

ఇందుకోసం నగర దీపికలు అనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను టీడీపీ వినియోగించుకుంటోందని చెప్పారు. బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లు, ఊళ్లలో ఉన్నవారిని వలస పోయినట్లు చూపించి ఓట్లు తొలగిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు టీడీపీ నాయకులకు ఒత్తాసు పలికి వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. తానిచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చారని చెప్పారు.

ఓట్ల తొలగింపు విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు అప్రమత్తం కావాలని గోపిరెడ్డి సూచించారు. ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో ఓటు లేకపోతే ఎందుకు తొలగించారో సంబంధిత అధికారులను నిలదీయాలన్నారు. ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులకు గోపిరెడ్డి సూచించారు. గోపిరెడ్డి వెంట పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయానికి వచ్చారు.

మరిన్ని వార్తలు