ఎమ్మెల్యే వాసుపల్లిని ఓడించి తీరతాం

21 Feb, 2019 07:46 IST|Sakshi
మాట్లాడుతున్న విశాఖ అర్బన్‌ టీడీపీ మైనారిటీ వింగ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ సాదిక్, తదితర సీనియర్‌ నాయకులు

దక్షిణంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన గణేష్‌కుమార్‌

ఎమ్మెల్యే తీరుపై సీనియర్‌ టీడీపీ నాయకుల ఆగ్రహం

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షునిగా ఉన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. వాసుపల్లికి టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామంటూ ఆయన వైరిపక్ష నేతలు విశాఖ అర్బన్‌ టీడీపీ మైనార్టీ వింగ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ షాదిక్, మాజీ కార్పొరేటర్‌ చెన్నా రామారావు, తెలుగు మహిళ మాజీ ఉపాధ్యక్షురాలు గొర్ల అప్పలనర్సమ్మ తదితరులు బుధవారం పాతపోస్టాఫీస్‌ వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించి మరీ తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిన టీడీపీ నేతలపై తానే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. నియోకవర్గంలోని ప్రతి అభివృద్ధి పనికి కమీషన్‌ తీసుకుంటూ, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కమిటీల పేరిట నాయకులను తయారుచేసి వారి ద్వారా అక్రమార్జనకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులతో బెదిరింపులకు దిగుతున్నారని, ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయారు.

హిజ్రాల నుంచి కమీషన్లు దండుకోవడంతోపాటు పోర్టు పూల్‌ కలాసీలకు అండగా ఉంటానని నమ్మించి పోర్టు యాజమాన్యం నుంచి ముడుపులు తీసుకున్నారని, ప్రతి పనిలోనూ పర్సంటేజ్‌లు దండుకుంటున్నాడని తెలిపారు. పార్టీలో అనేక మంది సీనియర్‌ నాయకులు ఉన్నా.. తనకు నచ్చినవారిని కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో సభ్యులుగా నియమించాడని అన్నారు. ఒకసారి ట్రస్ట్‌బోర్డులో ఉన్నవారిని రెండో సారి నియమించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని తోసిపుచ్చి తన సిబ్బందికి రెండోసారి ట్రస్ట్‌బోర్డులో అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. నియోజవర్గం పరిధిలో ఉన్న రౌడీషీటర్లను, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే రాయబారం నడిపి వారిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులోని సమస్యలు తెలిపేందుకు వెళితే గంటల కొద్దీ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరీక్షించాల్సి రావడం బాధాకరమన్నారు. ఆయన సన్నిహితులను తప్ప ఇతరులను పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లికి సీటు ఇస్తే ఆయన్ని ఓడించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు దాడి రామలక్ష్మి, తొట్లమూడి శ్రీనివాస్, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు