టీడీపీ నుంచి బీజేపీలోకి ఊపందుకున్న వలసలు

26 Jun, 2019 18:39 IST|Sakshi

అమిత్‌ షాతో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ భేటీ

ఆయనతోపాటు మరికొంత మంది చేరే అవకాశం

వరుస వలసలతో కుదేలవుతున్న సైకిల్‌

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ వలసలతో కుదేలవుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి బీజేపీలోకి మరిన్ని వలసలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. తాజాగా టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం.. ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఆయనతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలుకావడంతో.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీలో భవిష్యత్తు లేదని, ఇతర పార్టీల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీలోని ఎక్కువమంది నేతలు కమలం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే.. పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఏళ్లపాటు చక్రం తిప్పిన కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు ఇటీవల పార్టీని వీడారు. వీరి దారిలోనే పయనించేందుకు మరికొంత మంది నేతల కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా మరికొంత మంది నేతలు బీజేపీ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో చేరే టీడీపీ నేతల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు బీజేపీ పెద్దలు కూడా టీడీపీ నేతలను చేర్చుకునేందుకు స్థానిక నాయకత్వంతో మంతనాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు