టీడీపీ ఎమ్మెల్సీలు తప్పు సరిదిద్దుకోవాలి

25 Jan, 2020 04:39 IST|Sakshi

ఎమ్మెల్సీ పోతుల సునీత  

సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకుని శాసనమండలి ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బిల్లు సందర్భంగా మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు. మండలిలో బిల్లు విషయంలో పొరపాటు చేశామని టీడీపీ సభ్యులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇప్పటికైనా వారు బాబు ట్రాప్‌లో పడకుండా బయటకు వచ్చి తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని శాసన మండలి చైర్మన్‌కు సైగలు చేస్తూ పూర్తిగా సభను పక్కదారి పట్టించారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. మండలి చైర్మన్‌ పూర్తిగా తప్పు చేశారని, ఆయన చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. తమది ప్రజల కోసం పనిచేసే కుటుంబమని, ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. మండలి రద్దుపై తుది నిర్ణయం సీఎందేనన్నారు. 

బిల్లులపై ఓటింగ్‌ జరగలేదు
మండపేట: శాసనసభ ఆమోదించిన బిల్లులపై శాసన మండలిలో ఎలాంటి ఓటింగ్‌ జరగలేదు కాబట్టి ఆ బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మీడియాతో మాట్లాడారు. సంవత్సరానికి 6 లక్షలు చొప్పున నాలుగేళ్లలో 24 లక్షల మందికి స్థలాలు, గృహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 21.34 లక్షల మందికి ఉగాది రోజుకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి మున్సిపాల్టీలో 33,817 మంది లబ్ధిదారులకు దాదాపు 2,500 ఎకరాల్లో సుందరమైన కాలనీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శాసన మండలి రద్దు అంశం ఇంకా చర్చ దశలో ఉందని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బదులిచ్చారు. మండలిని రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని  పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్‌కు కనుసైగలతో ఆదేశాలిచ్చారంటే రాజ్యాంగ విలువలు విషయంలో ఆందోళన కలుగుతోందన్నారు. తప్పు చేశానన్న తర్వాత రాజీనామా చేసి ఉంటే మండలి చైర్మన్‌ పేరు తారస్థాయికి వెళ్లేదని చెప్పారు.

టీడీపీ చర్యలకు నిరసనగా నేటి నుంచి ఆందోళనలు
ప్రజాస్వామ్య విలువల్ని శాసనసభ, శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం అధికార, పరిపాలన వికేంద్రీకరణ చేసి 13 జిల్లాల అభివృద్ధి కోసం తీసుకు వచ్చిన విధానాలను విద్యార్థులు, యువత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు పార్టీ సూచనా పత్రం పంపించింది. ఈ నెల 25న విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని, 27న యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని, 28న విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి–వికేంద్రీకరణపై యూనివర్సిటీల వద్ద సదస్సులను నిర్వహించాలని పార్టీ సూచించింది.

29న సంతకాల సేకరణ: 29న పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో ప్రజలచే సంతకాల సేకరణ చేపట్టాలని, 30న వికేంద్రీకరణ విషయంలో టీడీపీ తీరుపై భారత రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపే ఉద్యమం చేపట్టాలని పార్టీ కోరింది. ఈ నెల 31వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 3 ప్రాంతాల జేఏసీ నేతల భేటీ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసేలా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చర్యలు తీసుకోవాలని పార్టీ జారీ చేసిన లేఖలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు