సీఎం తీరుతో తలవంపులు

30 Oct, 2018 05:16 IST|Sakshi

చంద్రబాబు ధోరణిపై టీడీపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి...      

జగన్‌పై హత్యాయత్నం తరువాత కనీసం పరామర్శించని సీఎం

విచారణకు ఆదేశిస్తే హుందాగా ఉండేది

గవర్నర్‌ డీజీపీతో మాట్లాడటాన్ని తప్పుపట్టడం మరీతప్పు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తీవ్రమైన విషయాల్లో తమ అధినేత, ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ప్రజల్లోనూ, జాతీయ స్థాయి పార్టీల్లోనూ మాకూ, మా పార్టీకి తలవంపులు తీసుకొస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలూ వాపోతున్నారు. దీన్నుంచి ఎలా గట్టెక్కాలా అని తలపట్టుకుంటున్నారు. సీఎం వ్యవహరిస్తున్న తీరు వల్ల అన్నింటిలోనూ అడ్డంగా దొరికి పోతున్నామని అవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పట్టపగలు ఓ పక్కా వ్యూహంతో విశాఖ విమానాశ్రయంలోనే హత్యాయత్నం జరిగితే ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగా స్పందించడంలో తప్పటడుగులు వేశారని, ఏదో చేద్దామంటే ఏదో అయ్యిందని వాపోతున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దాన్ని ఖండించి, ఆయన్ను పరామర్శించి, విచారణకు ఆదేశిస్తే ఎంతో హుందాగా ఉండేదని..అలాకాకుండా ఆ సంఘటనపై వెకిలిగా మాట్లాడటం..ప్రతిపక్ష నేతను ‘వాడు’ అని అమర్యాదగా సంబోధించడం నలుగురిలో చెడ్డపేరు తెచ్చిందని టీడీపీకి చెందిన ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. దాడి జరిగాక జగన్‌ నేరుగా విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారని, బీజేపీ వాళ్లు ఢిల్లీనుంచి చెబితే మళ్లీ హాస్పిటల్‌లో చేరారని, ఇందంతా ఓ డ్రామా అని సీఎం స్థాయి వ్యక్తి పేర్కొనడం వల్ల జనంలో తమ పరువు పోయిందని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మా బాబుగారు తప్పుమీద తప్పు చేస్తున్నారని, ఇది పార్టీకి చాలా నష్టం చేకూర్చేలా ఉందని మరో ఎంపీ వాపోయారు. హత్యాయత్నం విషయమై గవర్నర్‌ డీజీపీతో ఎలా మాట్లాడతారని సీఎం స్థాయి వ్యక్తి ప్రశ్నించడంతగదని, ముఖ్య సంఘటనపై గవర్నర్‌ వివరాలు తెలుసుకుంటే తప్పెలా అవుతుందని, ప్రతీదాన్ని రాజకీయం చేయడం తగదని ఆ పార్టీకే చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ మంత్రి అభిప్రాయపడ్డారు.

విచారణకు ఆదేశించకపోవడంతో డిఫెన్స్‌లో పడ్డాం...
 జగన్‌పై హత్యాయత్నం కేసుపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తే హుందాగా ఉండేదని, అలా చేయకపోవడంతో తాము డిఫెన్స్‌లో పడ్డామని, తప్పు తమవైపు ఉందనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందని ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఓ సీనియర్‌ నేత అన్నారు. హుందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీల అంశాన్ని ముందుకు తేవడం, విమానాశ్రయంలో హోటల్‌కూడా టీడీపీకి చెందిన వారిదే కావడం, దాని యజమాని పార్టీలో కీలక వ్యక్తులకు క్లోజ్‌ కావడం వల్ల తాము ఆత్మరక్షణలో పడ్డామని, జనం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో  గరుడ పురాణం అంశాన్ని సమర్థించడం సబబు కాదన్నారు. హత్యాయత్నం సంఘటన జరిగిన రెండు గంటలకే డీజీపీ హడావుడిగా మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ అభిమానే జగన్‌పై కత్తితో దాడి చేశాడని ప్రటించడం, రాత్రి సీఎం మాట్లాడుతూ సంఘటన జరిగిన నాలుగున్నర గంటల తరువాత తమకు వివరాలు తెలిసాయని చెప్పడంతో తాము చెప్పేది తప్పని తెలిసిపోయిందని రాయలసీమకు చెందిన ఓ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఓ ఎత్తయితే, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పడం  ఇంకా తలవంపులు తెస్తోందని, ఇది విని జనాలు ముక్కుమీద వేలేసుకుంటున్నారి గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్‌నేత ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర సంస్థలను మూసేయమని చెప్పాలా?  
ముఖ్యమంత్రి బినామీ అయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు తదితర వ్యాపార, రాజకీయ నాయకుల సంస్థల అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ పరిశీలనలు, సోదాలు చేయడాన్ని తప్పుపట్టడం, వాటిని ఒక జాతీయ సమస్యలాగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడాన్ని ఇతర పార్టీల నేతలు ఎద్దేవా చేస్తున్నారని పలువురు ఎంపీలు ‘సాక్షి’ ముందు అభిప్రాయపడ్డారు. పన్ను ఎగవేతదారులు, తప్పుడు ఆదాయాన్ని చూపే వారిపై రాజ్యాంగపరంగా ఏర్పాటైన సంస్థ పరిశీలనలు చేయడం అత్యంత సాధారణ అంశమని ఇతరపార్టీలు గుర్తుచేస్తున్నాయని అన్నారు.  దాన్ని ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రికి కూడా లేదని, కేంద్ర సంస్థల సామరŠాధ్యన్ని, విశ్వసనీయతను దెబ్బతీసేలా, విధులను అడ్డగించడం ఎలా సమర్ధనీయమంటున్నారని ఎంపీలు చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారంటే ఇతర పార్టీల నాయకులు, మీడియా కలవడానికి ఇష్టపడేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు అసల్లేవని అంటున్నారు. చివరకు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, మీడియా కూడా అంటీముట్టనట్లు వ్యవహరించాయని చంద్రబాబును వెన్నంటి ఉండే ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దే నాయకులు కూడా తమను కేంద్రంలో పట్టించుకునే వారు కరవయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు