అది నాకు సెంటిమెంట్‌.. ఆయన వస్తే గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ

16 Nov, 2023 19:52 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని హోం మంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదని విమర్శించారు. ఈ మేరకు ముస్లిం, మైనార్టీ సభలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముస్లింల కోసం సీఎం రూ. 32 వందల కోట్లు ఖర్చు చేశారని.. అదే ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 50 లక్షలు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.

తెలంగాణలో ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్‌ మంచి విద్యను అందిస్తున్నారని తెలిపారు. పేద వాడి కోసం పని చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని అన్నారు. షాదీముబారక్‌తో ముస్లిం మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. ‘నా తమ్ముడు అజయ్, ఆయన 10 సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నాడు. నా తమ్ముడికి తోడుగా మీరంతా ఉండాలి. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు. హైదరాబాద్ వ్యక్తులు వచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని వెళ్తున్నారు. 

నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా, అన్నింటి కంటే ఎక్కువగా ఖమ్మం అభివృద్ధి చెందింది. పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ఖమ్మం అభివృద్ధికి కావాల్సిన నిధులు అడుగుతుంటారు. కాంగ్రెస్ పార్టీవి మొత్తం మాటలే. ముసలి పార్టీని పట్టించుకునే వాడు లేడు. వీల్ చైర్‌లో తిరిగే ముసలి వాడు మీకు కావాలా? యువకుడైన పువ్వాడ అజయ్ కావాలా నిర్ణయించుకోండి.
చదవండి: తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్‌ పార్టీ: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో మంచి మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నియోజకవర్గం పట్ల అతనికి ఉన్న నిబద్దత ఇంకా ఎవరికి లేదు. ముస్లిం, క్రిస్టియన్‌లు ఇరువురు అన్నా దమ్ములు వారి పండుగ మేము, మా పండుగ వారు జరుపుకుంటారు. అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు మీ ఓటు వృథా చేయకుండా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. అజయ్ అన్నకు మరోసారి అవకాశం ఇవ్వండి. పోయినసారి కంటే భారీ మెజార్టీతో నా తమ్ముడు పువ్వాడ అజయ్‌ను గెలిపించండి’ అని హోంమంత్రి కోరారు.

2018 నవంబర్‌లో ఖమ్మం ప్రాంతంలో పెట్టిన మైనార్టీ సభ తనకు సెంటిమెంట్‌ సభ అని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో హోం మంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే 16కు 16 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. ఆయన వస్తే గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకు సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు మైనార్టీల పట్ల ఉన్న నిబద్దత అర్థమవుతోందన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ స్థానం కేసీఆర్ గుండెల్లో పదిలలంగా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు