మండలి టికెట్‌ మహేందర్‌రెడ్డికే!

11 May, 2019 11:41 IST|Sakshi
పట్నం మహేందర్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డికే టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి  స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే.

ఇంతకు ముందు ఈ స్థానంలో ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, అధికార పార్టీ తరఫున బరిలో ఎవరు ఉంటారన్నది ఇప్పటి వరకు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ మధ్యలో మహేశ్వరం ఎమ్మెల్యే 

సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో పార్టీ అధిష్టానం నుంచి సబితమ్మకు మంత్రి పదవితోపాటు కార్తీక్‌కు ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కార్తీక్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే కార్తీక్‌ మాత్రం ఎమ్మెల్సీ బరిలో లేరని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఎవరి పేరు ఖరారు చేసినా తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి.

సీఎం భరోసా మేరకు.. 
అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మహేందర్‌రెడ్డి.. చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ ఆశించారు. దాదాపు ఈ టికెట్‌ ఆయనకే ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, అనూహ్యంగా మహేందర్‌రెడ్డి మిత్రుడు పారిశ్రామికవేత్త డాక్టర్‌ రంజిత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇలా చివరి నిమిషంలో టికెట్‌ చేజారిన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని సీఎం కేసీఆర్‌ అప్పుడు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మహేందర్‌ రెడ్డి వైపు సీఎం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
 
నేడు కాంగ్రెస్‌ అభ్యర్థిపై స్పష్టత 
కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై కాంగ్రెస్‌ పెద్దలు శనివారం ప్రత్యేకంగా గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డిలు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిద్దిరిలో ఒకరికి అవకాశం ఇస్తారా? లేదంటే మరొకరిని తెరమీదకు తీసుకొస్తారా? అనేది ఈ భేటీలో తేలనుంది.

మరిన్ని వార్తలు