జోష్‌ లేకపాయె!

3 May, 2019 07:36 IST|Sakshi

ప్రాదేశిక ఎన్నికల సమయం సమీపిస్తున్నా.. ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ, కాంగ్రెస్‌లో జోష్‌ కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీకి దిగిన ఇరు పార్టీలు ప్రచారంలో వెనకబడ్డాయి. ఇప్పటికే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల తర్వాత కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ కనీసం ఈ ఎన్నికల్లోనైనా కారును ఢీ కొంటారని రాజకీయ పరిశీలకులు  భావిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ఇంత వరకు జాతీయ పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కొందరు మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి, రెండో విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో చాలా చోట్ల ప్రచారపర్వం అంతంత మాత్రంగానే కనబడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీల క్యాడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఇదిలా ఉంటే ఈసారి కూడా ఆశించిన మేరకు ఫలితాలు రాకపోతే రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్‌పై ఆయా పార్టీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు బెంగపట్టుకుంది.

ఈ నెల 6న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట, జడ్చర్ల, భూత్పూర్, గండేడ్, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్‌ జెడ్పీటీసీ స్థానాల్లో, వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, ఖిల్లాఘనపూర్, గోపాల్‌పేట, రేవెల్లి, జెడ్పీటీసీ స్థానాలకు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు జెడ్పీటీసీ స్ధానాలు, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్‌ జెడ్పీటీసీ స్ధానాల్లో తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న.. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట, కోయిలకొండ, మహబూబ్‌నగర్, హన్వాడలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.

నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూర్‌ జెడ్పీటీసీ స్ధానాలు, గద్వాల జిల్లా అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి జెడ్పీటీసీ స్థానాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ, ఊర్కొండ, కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి జెడ్పీటీసీ స్థానాలు, వనపర్తి జిల్లా పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత జెడ్పీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఆయా స్థానాల్లో ప్రచారవేగాన్ని పెంచారు.

తొలి విడత ఎన్నికలు జరిగే జెడ్పీటీసీ స్థానాలతో పాటు వాటి పరిధిలో ఉన్న ఎంపీటీసీ స్థానాల్లోనూ గులాబీ శ్రేణులు గెలుపే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు సర్పంచులందరూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉండడం.. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలందరూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు పలు చోట్ల మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి బడానాయకులెవరూ వారికి మద్దతుగా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు కనబడడం లేదు.

కాంగ్రెస్‌లో అయోమయం.. 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్‌ అధిష్టానం ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకే అప్పగించింది. ఇప్పటికే మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసిన డీసీసీ అధ్యక్షుడు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు అందరికీ బీ–ఫారాలు అందజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అధికార పార్టీని ఢీ కొట్టేంత నాయకత్వం ఆయా మండలాల్లో లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపుపై దిగులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న మండలస్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదీలా ఉంటే ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థిగా అనిరుధ్‌రెడ్డి సోదరుడు దుష్యంత్‌రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్‌ మిగతా నాలుగు చైర్మన్లను ఖరారు చేయలేదు.

కమలం వికసించేనా ? 
ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రమే ప్రభావం ఉన్న బీజేపీ ప్రాదేశిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది? లోక్‌సభ ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ ఎంత మంది అభ్యర్థులను గెలిపించుకుంటారో అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం డీకే అరుణ నాయకత్వంలో కేవలం గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రమే బీజేపీ నాయకులు ప్రచారం కొంత మేరకు జరుగుతోంది. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్‌ చైర్మన్ల అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ఆచితూచి  వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయో చూసి అందులో బలమైన నాయకుడిని జెడ్పీ చైర్మన్‌గా ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు