కన్నడనాట తెలంగాణ పథకాలు 

5 May, 2018 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను కర్ణాటకలో అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకాన్ని ‘మిషన్‌ కల్యాణ్‌’పేరుతో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి’పథకాన్ని పేరు మార్చి ‘వివాహ మంగళ యోజన’గా అమలు చేస్తామని హామీని ఇచ్చింది. ఈ పథకంలో భాగంగా 3 గ్రాముల బంగారాన్ని, రూ.25 వేల నగదును అందిస్తామని పేర్కొంది.

టీఎస్‌ ఐపాస్‌ స్ఫూర్తితో ‘కె–హబ్స్‌’పేరుతో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. పారిశ్రామిక అనుమతులను సులభతరం చేయడానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద సింగిల్‌ విండో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చింది. సబ్సిడీ కింద భోజనాన్ని అందిస్తున్న అన్నపూర్ణ పథకాన్ని ‘అన్నదషోహ’పేరుతో అమలుచేస్తామని పేర్కొంది. మరోవైపు ఈ అంశాలను మంత్రి కేటీఆర్‌ కూడా ట్వీటర్‌లో ప్రస్తావించారు.  

మరిన్ని వార్తలు