ఈ కన్నీళ్లు.. కొన్నాళ్లే!

1 Apr, 2019 12:57 IST|Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌ : జవసత్వాలు ఉడికి కట్టెలుగా మారిన వృద్ధులు.. ముదిమిలో ఆసరా లేక ఆకలి కార్ఖానాలో పేగులు మాడ్చుకుంటున్నారు. ప్రభుత్వ నిర్దయకు గురై.. బతుకు భారమై కష్టాల సుడిగుండంలో విలవిలలాడుతున్నారు. పింఛన్‌ పెంచామని చెబుతూనే సవాలక్ష ఆంక్షలతో, బయోమెట్రిక్‌ జిమ్మిక్కులతో కొర్రీ పెట్టిన సర్కారు మాయాజాలంలో చిక్కుకుని వేదన పడుతున్నారు. అర్హతకు పార్టీనే కొలమానంగా మార్చిన తీరుకు కన్నీరవుతున్నారు. ఇదేనా మా భవిష్యత్‌కు మీ బాధ్యత అంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు. కుల, మత, వర్గ బేధం లేకుండా, పార్టీలకతీతంగా పింఛన్‌ రూ.3 వేలు ఇస్తామన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనను మనసారా స్వాగతిస్తున్నారు. ప్రజా సంకల్ప సూరీడై వచ్చిన ఆయన తమ బతుకుల్లో నవోదయం తీసుకొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.                                                

మూడేళ్ల నుంచి అర్జీలు పెడుతున్నా
మూడు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్‌ కోసం అర్జీలు పెడుతున్నా మంజూరు కావడం లేదు. నాకు 74 సంవత్సరాలు. అర్హత ఉన్నా  కూడా పింఛన్‌ ఇవ్వటం లేదు. కేవలం వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరుడిననే సాకుతోనే అడ్డుకుంటున్నారు. పింఛన్‌ ద్వారా వచ్చే డబ్బులు కనీసం మందు బిళ్లల కోసమైనా పనికొస్తాయని ఆశతో అర్జీలు పెడుతున్నా మంజూరు చేయడం లేదు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలకు అతీతంగా వృద్ధులకు నెలకు రు.3వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించడం భరోసా కల్పించింది.
–వనమాల వెంకటరెడ్డి, రుద్రవరం 

జగన్‌తోనే న్యాయం జరుగుతుంది
చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకే రూ.2వేలు ఇస్తున్నాడు. నాలుగేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు. జగన్‌ ప్రకటించాడని తెలియగానే తాను కూడా ఇచ్చాడు. జగన్‌ రూ.3వేలు ఇస్తానంటే తాను కూడా ఇస్తానంటున్నాడు. జగన్‌తో న్యాయం జరుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలన కరవుకాటకాలతో గడిచిపోయింది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పేదప్రజలకు న్యాయం జరుగుతుంది. అవ్వాతాతలకు రూ.3వేలు పింఛన్‌ కచ్చితంగా అమలవుతుంది. 
–పమిడిమర్రు జగన్, నరసరావుపేట

>
మరిన్ని వార్తలు