‘కేసీఆర్ కిట్స్ అన్నారో..లేక కేసీఆర్ కిడ్స్ అన్నారో’

20 Feb, 2018 18:13 IST|Sakshi
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌ రెడ్డి (పాత చిత్రం)

హైదరాబాద్‌ : తెలంగాణ స్వప్నం నెరవేరింది కాంగ్రెస్ వల్లనేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ బిల్లులో పెట్టిన వాటిని కూడా కేసీఆర్ సాధించలేదని మండిపడ్డారు. గాంధీభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి న్యాయపరమైన అంశాలపై కేసీఆర్‌ ఎందుకు పోరాటం చేస్తలేరని ప్రశ్నించారు. ఒక బోగస్ ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చిన వారు కేసీఆర్ కిట్స్ అన్నారో..లేక కేసీఆర్ కిడ్స్ అన్నారో తెల్వదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ ప్రశంసలు కురిపించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్స్‌, రైతులకు పంట పెట్టుబడి సాయం తదీతర పథకాలను ప్రశంసిన సంగతి గుర్తు చేస్తూ ఈవిధంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు సంతోషంగా లేరని, అణచివేత, పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌ సంవత్సరానికి పైగా సచివాలయానికి రాకుండా రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు.

 ఈ డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం కూడా నమ్మతోందని, మజ్లిస్ మీద అన్ని స్థానాల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసిన మార్గంలోనే  ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నామన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 60 రోజుల్లో చుట్టే విధంగా బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు