30న మోదీ ప్రమాణ స్వీకారం.. నేడు కేబినెట్‌ భేటీ

24 May, 2019 11:00 IST|Sakshi

లోక్‌సభ రద్దుకు నేడు తీర్మానం

30న  ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చెపట్టనున్నారు. ఈ నేపథ్యంలో 16వ లోక్‌సభను రద్దు చేసేందుకు నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. పార్లమెంట్‌లోని కేంద్ర సౌత్‌బ్లాక్‌లో సాయంత్రం ఐదుగంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. లోక్‌సభ రద్దుకు సంబంధించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం వుంది. లోక్‌సభ ఫలితాలు వెల్లడి అనంతరం మోదీ మంత్రివర్గం తొలిసారి సమావేశం కానుంది. కాగా ఈనెల 30న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్ల తెలుస్తోంది. అలాగే ఈనెల 26న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి.. అదే రోజున లోక్‌సభపక్ష నేతను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోక్‌సభ రద్దు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి అంశాలపై నేటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

నేడు జరిగే మంత్రిమండలి  సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కాగా కేబినేట్‌ భేటీకంటే ముందు బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మరుళీమనోహర్‌జోషీలతో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా భేటీ కానున్నారు. కాగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు వారాణాసి పర్యటన ఉంటుందని సమాచారం. ఆయనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞత తెలిపిన అనంతరమే రెండోసారి బాధ్యతలు చేపడాతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు 28న వారాణాసి పర్యటన ఉంటుందని తెలుస్తోంది.

అలాగే 29న గాంధీనగర్‌ వెళ్లి ఆమె తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం కూడామోదీ తీసుకోనున్నారు. కాగా నిన్న దేశ వ్యాప్తంగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 303 చోట్ల ఘనవిజయం సాధించింది రికార్డు విజయాన్ని సొంతంచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కూటమికి 348 సీట్లు రాగా.. కాంగ్రెస్‌ కూటమి 92 సీట్లకే పరిమితమైంది.

మరిన్ని వార్తలు