దమ్ముంటే నా సవాల్‌ స్వీకరించండి : కోమటిరెడ్డి

20 Mar, 2019 16:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన అవకాశవాదులే ప్రస్తుతం పార్టీని వీడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోగా.. మాజీ మంత్రి, సీనియర్‌ నేత డీకే అరుణ కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణను పార్లమెంటుకు పోటీచేయమని చెబితే నిరాకరించారని ఉత్తమ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, అసెంబ్లీ ,కౌన్సిల్‌ను ప్రగతి భవన షిఫ్ట్‌ చేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిచినా చేసేది శూన్యమని...ఐదేళ్లు తన ఎంపీలతో ఏదీ సాధించని కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కులేదని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. విభజన హామీలు సాధించలేని కేసీఆర్‌.. మతతత్వ బీజేపీకి సహకరించడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ మళ్ళీ ఓటేస్తే ..మోరీలో వేసినట్లేనని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతో పాటు..విభజన హామీలన్నీ సాధిస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘ఐటీఐఆర్ తెస్తాం ..కొత్త ఉద్యోగాలు ఇస్తాం ఎస్టీ ,ముస్లింలకు జనాభా దామాషా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

నైతిక విలువలకు తిలోదకాలు
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ..ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా సాధించలేని కేసీఆర్‌కు ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. నైతిక విలువలను మంటకలుపుతూ...కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలని లేకుండా చేయాలనుకుంటున్న ..కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మరోవైపు హామీల అమలులో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని జానారెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ ఎన్నికలు మలుపు తిప్పుతాయి
కేసుల భయంతోనే కేసీఆర్‌ ప్రధాని మోదీకి వంతపాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో కేసీఆర్‌కు అసలు సంబంధమే లేదని.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలని హితవు పలికారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పాలన పారిశ్రామికవేత్తలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని జోస్యం చెప్పారు.

దమ్ముంటే నా సవాల్‌ స్వీకరించు
16 ఎంపీ సీట్లు గెలవకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్‌ విసిరారు. దమ్మూ, ధైర్యం ఉంటే కేటీఆర్‌, కేసీఆర్ తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ‘పార్టీలో అందరూ కాంగ్రెస్‌తో లాభపడ్డవారే అవకాశవాదులు. స్వార్థంతోనే కొందరు టీఆరెఎస్‌లోకి వెళుతున్నారు. టీఆర్‌ఎస్‌తో తలపడేందుకు సిద్ధం. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలతో పాటు.. మెజారిటీ ఎంపీలను గెలుస్తాం. అభ్యర్థుల ముఖం కాదు ..నా ముఖం చూసి కేసీఆర్ ఓటేయమంటున్నారు అం‍టే టీఆర్‌ఎస్ అభ్యర్థులందరూ డమ్మీలే అని కేసీఆర్ చెబుతున్నారు’  అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కొలిమిలా మార్చిన కేసీఆర్‌కు ప్రజలు తొందర్లోనే బుద్ధి చెబుతారన్నారు.

మరిన్ని వార్తలు