50 రోజులు.. 100 సభలు

5 Sep, 2018 02:15 IST|Sakshi
మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సభ ఏర్పాట్లను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌

  ముందస్తు ప్రచారంపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన టీఆర్‌ఎస్‌  

  ‘ప్రజా ఆశీర్వాదం’ పేరుతో బహిరంగ సభలు 

  ఈ నెల 7న హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం  

  ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు హరీశ్, ఈటల

సాక్షి, సిద్దిపేట: ఊహించినట్లుగానే ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సిద్ధం అవుతున్నట్లు తేలిపోయింది. త్వరలోనే రాజకీయ నిర్ణయాలు ఉంటాయని ఆదివారం కొంగర కలాన్‌లో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లుగానే మంగళవారం మరో కీలక ఘట్టానికి తెరలేపింది. ‘ప్రజా ఆశీర్వాద’సభల పేరుతో ఎన్నికల శంఖారావానికి టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. 50 రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో 100 బహిరంగ సభలు నిర్వహించేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. రోజూ రెండు నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

ఇందులో భాగంగానే ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మొదటి సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు 65 వేలకుపైగా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. మంగళవారం ఈ మేరకు సిద్దిపేట సుడా కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమీక్షా నిర్వహించారు.

అచ్చొచ్చిన హుస్నాబాద్‌..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలు హుస్నాబాద్‌ నుంచే ప్రారంభమయ్యాయి. అప్పుడు సమయం తక్కువగా ఉండటంతో హెలికాప్టర్‌లో రోజు పది నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. అలాగే ముందస్తుకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌ ఈసారి కూడా హుస్నాబాద్‌ నుంచే బహిరంగ సభలు ప్రారంభించాలని భావించింది.

ఈ సభలకు ‘ప్రజా ఆశీర్వాద సభ’లు అని నామకరణం చేసి ఈ నెల 7న ముహూర్తం నిర్ణయించింది. ప్రారంభం అదిరేలా ఉండాలని మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు కసరత్తు మొదలెట్టారు.  జన సమీకరణ బాధ్యతలను మంత్రులు ఈటల, హరీశ్,  ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, రసమయి, విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు నారదాసు, పాతూరిలు తదితరులు తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు