‘ఎట్టి పరిస్థితుల్లో ఛలో ట్యాంక్‌ బండ్‌ నిర్వహిస్తాం’

8 Nov, 2019 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలు మగ్దూం భవన్‌లో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో ట్యాంక్‌ బండ్‌ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పినా కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌పై సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్‌ను కోరితే..  నిరాకరించారని వారు వెల్లడించారు.

ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్టులపై ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు చర్చించారు. కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, కె.నారాయణ, తమ్మినేని వీరభద్రం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఛలో-ట్యాంక్ బండ్‌ కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు ఇవ్వడం లేదు. ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం. ఏదేమైనా శనివారం మధ్యహ్నం చలో ట్యాంక్‌ బండ్‌ జరిపి తీరుతామని ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు.

హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రికి సోయి రావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపోకుండా.. విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు టీఎస్ ఆర్టీసీకి లేదని ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే హక్కు కేసీఆర్‌కు లేదని వెల్లడించారు. కార్మికులకు మద్దతుగా సామూహిక నిరసన దీక్షలకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు