రాజా వర్సెస్‌ కృష్ణుడు

15 Mar, 2019 09:44 IST|Sakshi
తునిలో ప్రసిద్ధిగాంచిన తలుపులమ్మలోవ దేవస్థానం 

యనమల కుటుంబం అంతులేని అరాచకాలు

మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి చేసింది శూన్యం

దాడిశెట్టి రాజాకు అనుకూల పవనాలు

నిరంతరం ప్రజల తరపున పోరాటం 

అక్రమ కేసులకు ఎదురొడ్డి నిలిచిన ఎమ్మెల్యే 

తూర్పు గోదావరి జిల్లాకు తూర్పు ముఖ ద్వారం లాంటి తునిలో తొలుత రాజరిక వ్యవస్థ ప్రాబల్యం చూపినా క్రమేపీ రాజకీయం సామాన్యుడి చేతుల్లోకి వచ్చింది.  నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మజిలీలు కనిపిస్తాయి. తుని పేరు తలుచుకోగానే గుర్తుకొచ్చేది తలుపులమ్మలోవ. పూర్వం తలుపులమ్మలోవకి వెళ్లడం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత గొప్పగా భావించేవారు. ఈ లోయలో ఒక జలపాతం ఉంది. గతంలో అందులో నీళ్లు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉండేవంటారు. ఎన్నికల ప్రచారం నుంచి రాష్ట్ర స్థాయిలో పలు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. తుని ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తారు.   – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ

కాంగ్రెస్, టీడీపీ కోటలో వైఎస్సార్‌సీపీ పాగా 
తుని నియోజకవర్గానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో రాజా వి.వి.కె. బహుదూర్‌ (బుల్లిబాబు) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో రాజా వి.వి.కె. బహుదూర్‌ (బుల్లిబాబు) కుమార్తె ఎం ఎన్‌. విజయలక్ష్మిదేవి విజయం సాధించి తుని తొలి మహిళా శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1978లో రెండోసారి గెలిచిన విజయలక్ష్మిదేవి 1981లో టి.అంజయ్య క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి 1982 వరకు తునిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే శాసన సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. రాజా వి.వి.కె. బహుదూర్‌ (బుల్లిబాబు)  కుటుంబానికి చెందిన వారే ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించారు. అనంతరం టీడీపీ అవిర్భావంతో బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు రాజ కుటుంబాన్ని ఓడించి శాసన సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2009లో జరిగిన ఎన్నికల్లో యనమల రామకృష్ణుడిపై రాజా ఆశోక్‌బాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆరు పర్యాయాలు గెలిచిన యనమల రికార్డుకు తెర పడింది. 2014 ఎన్నికల్లో యనమల తన సోదరుడు కృష్ణుడ్ని రంగంలోకి దించినా ఫలితం దక్కలేదు. కృష్ణుడిపై వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసిన దాడిశెట్టి రాజా విజయం సాధించారు. నియోజకవర్గ ఓటర్లు దాడిశెట్టి రాజావైపే మరోసారి మొగ్గు చూపుతున్నారు. 

యనమల కుటుంబం అరాచకాలు..
మంత్రి యనమల రామకృష్ణుడు పలుసార్లు ప్రాతినిథ్యం వహించిన తునిలో అరాచకం రాజ్యమేలుతోంది. మంత్రి యనమల అధికారం అండతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాని అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి సోదరుడైన కృష్ణుడు ఆగడాలకైతే అడ్డూ అదుపూ లేదు. యనమల కుటుంబం, అనుచరుల అక్రమాలకు అంతు పొంతూ లేకుండా పోయింది. దాదాపు 57 నెలల కాలంలో అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఖాళీ స్థలాలు  కబ్జా చేశారు.  పోలీసు స్టేషన్, సంస్థానం స్థలాలను సైతం ఆక్రమించేశారు. ఇసుక, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేసి మింగేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల ముసుగులో నిధులు స్వాహా చేశారు. ఇళ్లు, కార్పొరేషన్‌ రుణాలు, ఆక్వా అనుమతులు మంజూరు చేసేందుకు ముడుపులు గుంజారు.  రూ.వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అంతటితో ఆగలేదు... అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. ప్రజలు స్వేచ్ఛగా గళం విప్పే అవకాశం ఇవ్వలేదు. యనమల రామకృష్ణుడు సీనియర్‌ మంత్రి హోదాలో ఉన్నా నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు, సాగునీటి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. 

ఈసారి త్రిముఖ పోరు 
ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తిరిగి పోటీ చేయనున్నారు. టీడీపీ తరఫున యనమల కృష్ణుడు మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే కృష్ణుడు పోటీ చేస్తున్నట్టు బహిరంగ సభల్లో కూడా ప్రకటించారు. ఆఖరి నిమిషంలో మార్పులు జరిగితే యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్యను బరిలోకి దింపే అవకాశం ఉంది. జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్వివి.కృష్ణంరాజు 
(రాజా అశోక్‌బాబు) పోటీ చేయనున్నారు.

ప్రజల తరపున దాడిశెట్టి రాజా పోరాటం 
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిరంతరం ప్రజలు తరపున పోరాడుతూనే ఉన్నారు. మంత్రి యనమల ఒత్తిళ్లతో ఎన్ని కేసులు నమోదైనా వెరవలేదు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో రైలు దగ్ధం ఘటనకు సంబంధించి బనాయించిన అక్రమ కేసులపై ప్రజలు, కార్యకర్తల తరపున పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు అన్ని సామాజిక వర్గాలతో సఖ్యతతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. దివంగత వైఎస్సార్‌ తమ నియోజకవర్గానికెంతో చేశారని, పేద ప్రజల పాలిట దైవంగా నిలిచారని తుని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. 

తుని ప్రజల ప్రధాన సమస్యలు...

  • 2012 నవంబరు 4న తాండవ నది ఉప్పొంగి ప్రవహించడంతో తుని, పాయకరావుపేట పట్టణాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుని మండలం కుమ్మరిలోవ, పట్టణంలోని రెల్లిపేట, రాజీవ్‌ గృహకల్ప, అమ్మాజీపేట, సీతారామపురం, కొండవారిపేట, తారకరామానగర్, ఇసుకల పేట, మేదరిపేట, బాలాజీ సెంటర్, రైల్వే కాలనీ, తదితర ప్రాంతాలు నీటమునగడంతో అపార నష్టం వాటిల్లింది. పలువురు జీవనోపాధి కోల్పోయారు. 
  • తాండవనది పరీవాహక ప్రాంతంలో వరదనీటి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రతిపాదించిన రక్షణ గోడ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. 2013లో వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మిస్తామని ప్రజల సాక్షిగా ఇచ్చిన హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. కరకట్ట కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు.  
  • తుని మండలంలోని మెట్ట గ్రామాలకు గోదావరి జలాలు అందకపోవడంతో ఏటా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. 
  • కోటనందూరు మండలం జగన్నాధపురం–భీమవరపుకోట రోడ్డులో ఉన్న వెంకటాచలం చెరువుపై 2012 నీలం తుపాను సమయంలో గండి పడింది. ఈ చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. గండి కారణంగా చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోటనందూరు మండలం అల్లిపూడిలో రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన  భారీ మంచినీటి పధకం పనులు నేటికీ కొనసాగుతున్నాయి. 90 శాతం పనులు పూర్తయినా పైపులైను శిధిలం కావడంతో నీటి సరఫరాకు నోచుకోవడం లేదు.


జనాభా : 2,97,450
ఓటర్లు - 2,03,043
పురుషులు- 1,01,354
మహిళలు- 1,01,673
ఇతరులు- 16

మరిన్ని వార్తలు