మహాకూటమిదే అధికారం

8 Dec, 2018 02:43 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గరిడేపల్లి/కోదాడ: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావటం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ పాలనకు నేటితో వీడ్కోలు పలికారన్నారు. నాలుగున్నర సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు సీఎం కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా లైన్లో నిలబడి ఓట్లు వేశారన్నారు.

రాష్ట్రంలో 85 సీట్లలో మహాకూటమి విజయం సాధించబోతోందన్నారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీల కూటమి ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రజా ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఓటింగ్‌శాతం ఎంత పెరిగితే అంతే స్థాయిలో మెజార్టీ సీట్లు కూటమికి రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని మహాకూటమికి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆయనవెంట సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ఉన్నారు. 

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఉత్తమ్‌ 
గరిడేపల్లి, పొనుగోడు, కీతవారిగూడెంలో గ్రామాలలో పోలింగ్‌ కేంద్రాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ముచ్చటించారు.  

కోదాడలో ఓటేసిన ఉత్తమ్‌ 
టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కోదాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నా రు. గతంలో ఆయన రెండు సార్లు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన ఓటు పట్టణంలోని రెండవ వార్డులో నమోదై ఉంది. పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఉన్న ఈవీరెడ్డి డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన బూత్‌కు ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చి ఓటు వేశారు.
 

మరిన్ని వార్తలు