‘గద్దె దించే రోజులు దగ్గర్లోనే’

28 Jan, 2018 03:13 IST|Sakshi

సీఎం జిల్లాలోనే రైతు ఆత్మహత్యలెక్కువ

అయినా ఆయనలో చలనం లేదని ఉత్తమ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రోజుకో కొత్త మాటతో ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని విమర్శిం చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయిని, అయినా ఆయనలో చలనం లేదని నిప్పులు చెరిగారు.

శనివారం గాంధీభవన్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన జేఏసీ నేత భూపతిరెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల గురించి ప్రశ్నిస్తే సీఎం సహించలేకపోతున్నారని ఆరోపించారు. మాదిగ వర్గీకరణ కోసం పోరాడుతున్న మంద కృష్ణను అరెస్టు చేయడం దారుణమని.. నిరసన తెలిపే హక్కునూ లేకుండా చేశారని దుయ్యబట్టారు.

తెలంగాణలో పోలీసుల జులుం నడుస్తోందని.. నేరెళ్లలో దళితులు, ఖమ్మంలో గిరిజనులు, రైతులు, మల్లన్నసాగర్‌ లో భూ నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేసేలా వారు వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ విదేశాల్లో, ప్రజాధనంతో విలాసాలు పొందుతున్నారని ఉత్తమ్‌ ఆరో పించారు. రాష్ట్రానికి విదేశాల నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదని విమర్శించారు.  

మరిన్ని వార్తలు