ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ సిద్ధం

4 Sep, 2018 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాతోపాటు ఇతర అంశాలపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓటర్ల జాబితాపై చర్చించడానికి సెప్టెంబర్‌ 7వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 9వ తేదీన మండల, డివిజన్‌ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరారు. గత నాలుగేళ్లలో 20 లక్షల మంది ఓటర్లు తగ్గారని.. 8 లక్షల కొత్త ఓటర్లు చేరిన తర్వాత కూడా ఓటర్ల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు. జాబితాలో ట్యాంపరింగ్‌ జరిగిందనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీలో కలిపినందున అక్కడ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. 10 శాతం వీవీప్యాట్‌లను లెక్కపెట్టాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ ఉందని దానిలో టీపీసీసీ కూడా ఇంప్లీడ్‌ అవుతుందని పేర్కొన్నారు. ఈవీఎమ్‌ మానిటర్‌ను మాన్యువల్‌ చేయాలని కోరారు.

కేసీఆర్‌ సమాధానం చెప్పాలి..
2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలోనే కేసీఆర్‌ ఏం చెప్పలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని.. దీనిపై ఎన్నికల కమిషన్‌ను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరతామని తెలిపారు.

మరిన్ని వార్తలు