ఎన్నికలంటే విపక్షాలకు భయమెందుకు

18 Mar, 2020 05:01 IST|Sakshi

ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు

కరోనా వ్యాధిని చంద్రబాబే కనుక్కొన్నట్లు మాట్లాడుతున్నారు 

టీడీపీ ఆదేశాలతోనే ఈసీ పని చేస్తోంది

చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర బ్రాండ్‌ను దెబ్బతిస్తోంది: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంటే విపక్షాలకు భయమెందుకని రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వారిద్దరూ వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రభుత్వం ముందుకొస్తే.. విపక్షాలు పారిపోతున్నాయ్‌
‘ప్రభుత్వాలు సహజంగా ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటాయి. కానీ.. ఇక్కడ ప్రభుత్వమే ఎన్నికలు పెడతామని ముందుకొస్తే.. విచిత్రంగా విపక్షాలు భయపడి పారిపోతున్నాయి’ అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్‌ ముగ్గురూ ఒకటేనని, వీరికి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..
- కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఆ ముగ్గురు నేతలు ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. 
- సరిగ్గా వారం రోజులు వదిలేస్తే ఎన్నికలు అయిపోతాయి. రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులు వస్తాయి. ఆ నిధుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేతలంతా ఆయనపై పందుల మాదిరిగా దండయాత్ర చేస్తున్నారు.
- కన్నాకు డిపాజిట్‌ రాలేదు, పవన్‌ రెండుచోట్ల, చంద్రబాబు కుమారుడు మంగళగిరిలో ఓడారు. కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని వీళ్లంతా కోరుకుంటున్నారు.
- టీడీపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసింది. బాబు రాయించిన స్క్రిప్ట్‌నే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చదివారు.

వాయిదా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
కరోనా సాకుతో స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేషజాలకు పోవద్దని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు. అందరూ ఎన్నికలకు సన్నద్ధమై ఉన్న తరుణంలో వాయిదా నిర్ణయం సరైనది కాదన్నారు. ఇంకా ఏమన్నారంటే..
- ఎన్నికల కమిషనర్‌ తన పరిధిని అతిక్రమించి, ఇతర రాజ్యాంగ సంస్థల హక్కులను కాలరాయటం సమంజసం కాదు.
- రమేష్‌కుమార్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ, యంత్రాంగాన్ని గానీ సంప్రదించి సలహాలు తీసుకున్నట్లు ఎక్కడా లేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సబబుకాదు.
- పార్లమెంటరీ వ్యవస్థలోని శాసన, పాలన, న్యాయ వ్యవస్థలన్నింటికీ ప్లీనరీ అధికారాలు ఉన్నాయి. అయితే, ఎవరూ వాటి పరిధిని దాటకూడదు.
- కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశామని చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలు చేపడుతున్న కరోనా నివారణ చర్యలు బహుశా కమిషనర్‌ రమేష్‌కుమార్‌ చూశారో లేదో. మార్చి 10న విద్యాశాఖ కరోనాపై సమీక్షించి నివారణకు మార్గదర్శకాలిచ్చింది. 

కోవిడ్‌ కాదు.. చంద్రబాబు ఎఫెక్ట్‌తోనే..
- స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక కోవిడ్‌ ఎఫెక్ట్‌ కారణం కాదు, చంద్రబాబు ఎఫెక్ట్‌ వల్లే వాయిదా. 
- ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అభివృద్ధి, సంక్షేమం, పాలన ఆగిపోతాయి. 
- ఎన్నికల కమిషనర్‌పై ఈగ వాలకుండా చంద్రబాబు, వాళ్ల మీడియా చూసుకుంటున్నారు. 
– కాకినాడలో విలేకరులతో మంత్రి కన్నబాబు

మరిన్ని వార్తలు