పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

16 Jul, 2019 13:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోలార్‌, పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పున: పరిశీలన చేస్తామంటే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కమిషన్లతో ఏటా రూ. 2500 కోట్ల ప్రజాధనం వృథా అయిందని తెలిపారు. యూనిట్‌ విద్యుత్‌ రూ. 2.70కి వస్తుంటే రూ. 4.84 చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని దోచిపెట్టారని నిలదీశారు.

తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజుల కాకముందే విషం చిమ్మే విమర్శలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గాలను అడ్డుకునేందుకు ప్రజలు ఆ పార్టీ నాయకుల్ని ఇంటికి పంపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో బాగా తెలుసని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు