కెప్టెనే కీలకం

23 Feb, 2019 07:51 IST|Sakshi

విజయకాంత్‌ చుట్టూ కూటమి రాజకీయాలు

విజయకాంత్‌ ఇంటికి రజనీకాంత్, స్టాలిన్‌

రెండురోజుల్లో తేల్చుకుంటామన్న డీఎండీకే

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని రెండు కూటములు సీట్ల సర్దుబాట్లలో ఒకవైపు దూసుకుపోతున్నా డీఎండీకే వైఖరి వల్ల ముందుకు పోలేని పరిస్థితి నెలకొని ఉంది. రెండు కూటములకు చెందిన నేతలు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కెప్టెన్‌ చుట్టూ కూటమి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్‌లో మరోకూటమిగా ఏర్పడి అధికారహోదా కోసం అర్రులు చాస్తున్నాయి. రాష్ట్రంలోని వామపక్షాలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక కూటమిలో సర్దుకుపోయాయి.

అయితే అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత అతిపెద్ద పార్టీ తనదేనని చెప్పుకుంటున్న డీఎండీకే అధినేత విజయకాంత్, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి మాత్రం సొంతకుంపటి పెట్టుకున్న తమిళమానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్‌ మాత్రం ఏ కూటమిలో చేరుదామా అనే తీరులో ఇంకా తర్జనభర్జన దశలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల వేడిరాజుకున్న కొత్తల్లో అన్నాడీఎంకే– బీజేపీ కూటమివైపు మొగ్గిన విజయకాంత్‌కు అక్కడ ఆశించిన సీట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే కూటమి వైపు దృష్టి సారించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రతిపక్ష కూటమి విజయకాంత్‌ను మచ్చిక చేసుకునే పనిలో పడింది. తమిళనాడు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ గురువారం విజయకాంత్‌ను కలిశారు.
 
ఇక శుక్రవారంనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా విజయకాంత్‌ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. అయితే ఎవ్వరికీ విజయకాంత్‌ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒకటి రెండురోజుల్లో నిర్ణయాన్ని తీసుకుంటానని విజయకాంత్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా నటుడు రజనీకాంత్‌ సైతం శుక్రవారం విజయకాంత్‌ ఇంటికి వెళ్లి వచ్చారు. అయితే కేవలం స్నేహపూర్వక కలయిక మాత్రమే ఒక్కశాతం రాజకీయాలు కూడా లేవని రజనీకాంత్‌ ఈ సందర్భంగా మీడియాకు స్పష్టం చేశారు. విజయకాంత్‌ ఇంటి వద్ద ఇలా ఎదుటి కూటమికి చెందిన నేతలు క్యూ కట్టడం అన్నాడీఎంకే అగ్రజులు ఎడపాడి, పన్నీర్‌సెల్వంలను ఆశ్చర్యానికి గురిచేసింది.

డీఎండీకేను ఎలాగైనా తమ జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్న అన్నాడీఎంకే విజయకాంత్‌కు ఐదుస్థానాలు కేటాయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ మేరకు మరలా కెప్టెన్‌తో చర్చలు మొదలుపెట్టారు. బీజేపీ–అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే చేరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. కూటమి చర్చల్లో ఎలాంటి ప్రతిష్టంభనలు లేవు, వారంరోజుల్లో ఒక నిర్ణయానికి వస్తామని విజయకాంత్‌ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత ప్రకటించారు. ఇలా రాష్ట్రంలోని రెండు కూటములు కెప్టెన్‌ చుట్టూ తిరుగుతుండగా విజయకాంత్‌ ఎటువైపు మొగ్గుతారా వేచిచూడాల్సిందే. 

మరిన్ని వార్తలు