ఓటు పుట్టుక.. నేపథ్యం

5 Apr, 2019 10:30 IST|Sakshi

సాక్షి, నారాయణఖేడ్‌: ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగం ఎన్నుకున్న విధానం ఓటు. ఏ భాషలో అయినా అభ్యర్థులను ఎన్నుకోవడాన్ని ఓటు అని పిలుస్తారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు, ఓటర్లు అనే పదాలు తరుచూ వినిపిస్తున్నాయి. కానీ చాలా మందికి ఓటు అనే పదానికి అర్థం తెలియదు. ఓటు అన్న పదం ఓటన్‌ అనే లాటిన్‌ పదం నుంచి సేకరించారు. ఓటు అన్న పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. ఓటు అంటే తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి తెలపడం, మద్దతు ఇవ్వడం, అంగీకారం, వాగ్దానం, ఎన్నుకోవడం అనే అర్థాలు ఉన్నాయి. ఎన్నికల్లో అభ్యర్థికి పాలనా అధికారాన్ని ఇవ్వడానికి తమ సమ్మతి తెలపడం అనే అర్థం ఉంది.

పుట్టుక
ఓటు వినియోగం క్రీస్తు పూర్వం 139 నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. పురాతన గ్రీస్‌ దేశంలో పగిలిన మట్టి పాత్రల ముక్కలను ఓట్లుగా వినియోగించినట్లుగా ప్రచారంలో ఉంది. ప్రాచీన భారతదేశంలో క్రీస్తు శకం 920లో తమిళనాడులో అరటి ఆకుల ద్వారా ఎన్నికలను నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఈ పద్ధతిని కూడా వొలూ వ్యవస్థ అని పిలిచే వారు. ఆమెరికాలో మొదటి సారిగా కాగితపు బ్యాలెట్లతో మాసాచు అనే  సెట్స్‌లో ఓ చర్చి ఫాస్టర్‌ ఎన్నిక కోసం వినియోగించారు.  

ఆయా దేశాల రాజ్యాంగాలు పాలనా పరంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని అందించాయి.1952 నుంచి మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు వినియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే వారు. తర్వాత ఎలక్ట్రానిక్‌ యంత్రాల ద్వారా ఓటు వేస్తున్నారు. రాబోయే కాలంలో ఓటు వేసిన తర్వాత రశీదు ఇచ్చే విధానం కూడా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పలువురు అధికారులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు