పొరపాటున ఓటేసి.. వేలు కోసుకున్నాడు

20 Apr, 2019 00:01 IST|Sakshi

అభిమానానికి అవధుల్లేనట్టే, వ్యతిరేకతలోనూ విపరీతం ఉంటుందని ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షా పార్లమెంటు స్థానంలో జరిగిన ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షా పార్లమెంటు స్థానంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినాయకురాలు మాయావతి మద్దతుదారుడు పవన్‌ కుమార్‌ తాను ఓటు వేయాలనుకున్న బీఎస్పీ అభ్యర్థి యోగేష్‌ వర్మ గుర్తు ఏనుగుపై కాకుండా, పొరపాటున బీజేపీ కమలం గుర్తున్న మీటపై నొక్కాడు. అది కాస్తా బీజేపీ íసిట్టింగ్‌ అభ్యర్థి భోలాసింగ్‌కి పడింది. దీంతో తను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా భావించాడేమో పవన్‌ కుమార్‌ తను ఓటు వేసిన వేలిని బ్లేడుతో కసిగా కోసుకున్నాడు. పైగా ఈ వ్యవహారాన్నంతటినీ తాపీగా వీడియో కూడా తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. 

కట్టుకట్టిన చూపుడువేలితో కుర్చీలో కూర్చుని నింపాదిగా విషయాన్ని వివరిస్తోన్న సదరు ఓటరు పవన్‌కుమార్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈవీఎం మెషీన్‌లో బీజేపీ మీట నొక్కాలని ఎవరైనా బలవంతం చేశారా అన్న ప్రశ్నకు ఆయన కాదని సమాధానం చెప్పాడు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, అజిత్‌ సింగ్‌ రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బులందర్‌షా నియోజకవర్గం నుంచి యోగేష్‌ వర్మ పోటీచేస్తున్నారు. సెకండ్‌ ఫేజ్‌ ఎన్నికల్లో భాగంగా బులందర్‌ షా సహా అలీఘర్, హాత్రస్, ఫతేపూర్‌ సిక్రీ, నగీనా, అమ్రోహ, మథుర, ఆగ్రాల్లో గురువారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు