జమిలి ఎన్నికలపై టీడీపీ ద్వంద్వ వైఖరి

8 Jul, 2018 15:46 IST|Sakshi

లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు సిద్ధం

రాష్ట్రంలో మాత్రం ఐదేళ్ల తర్వాతే ఎన్నికలు

లా కమిషన్‌కు తెలిపిన టీడీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల విషయమై టీడీపీ ఎంపీలు తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్ ఆదివారం లా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై టీడీపీ ప్రతినిధులు ద్వంద్వ వాదనలు వినిపించారు. జమీలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కావని వారు పేర్కొన్నారు. అదే సమయంలో 2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటే అందుకు సిద్ధమే కానీ.. జమిలి ఎన్నికల పేరిట ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే వ్యతిరేకిస్తామని తెలిపారు. లోక్‌సభను ముందస్తుగా రద్దుచేసి ఎన్నికలు నిర్వహించినా.. తాము మాత్రం రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయబోమని, అసెంబ్లీ ఐదేళ్లకాలం కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.. వారు ఏమన్నారంటే..

జమిలి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయ కమిషన్‌కు స్పష్టం చేశాం. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చునని, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకోవచ్చునని లా కమిషన్‌ పేర్కొంది. ఈ విషయంపై మా అభిప్రాయాలను కోరింది. అయితే, జమిలి ఎన్నికల ద్వారా ఈ లక్ష్యాలు నెరవేరవు. పైగా రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని మేం స్పష్టం చేశాం. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావాలని కేంద్రం భావిస్తే.. ఎన్నికలు ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. కానీ శాసనసభ ఎన్నికలకు మేం సిద్ధంగా లేము. ప్రజలు మాకు ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతమున్న ఇబ్బందికర పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మేం వ్యతిరేకం. జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు చర్చకు తీసుకురావడం ద్వారా కేంద్రం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది.  ఒకసారి ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ జరిపే మధ్యంతర ఎన్నికలు కేవలం పరిమిత కాలానికే నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విధానం ద్వారా ప్రాంతీయ పార్టీలను మరింత ఇబ్బందిపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం కూడా కేంద్రం ఉద్దేశమని టీడీపీ భావిస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే టాంపరింగ్‌ జరిగే అవకాశం ఉంటుందని కూడా లా కమిషన్‌కు వివరించాం. ఎన్నికల్లో వినియోగించే అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్‌ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కూడా వారికి సూచించాం.

మరిన్ని వార్తలు