‘నిరుద్యోగ భృతి ఎలా ఇయ్యాలో మాకు తెలుసు’

23 Feb, 2019 15:37 IST|Sakshi

హైదరాబాద్‌: సంకీర్ణ రాజకీయాలు రాజ్యం ఏలే సమయం వచ్చిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ శాసన మండలిలో ఈటల మాట్లాడుతూ.. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌, ఓట్ల కోసం పెట్టింది కాదని వ్యాఖ్యానించారు. పార్టీలు పనిచేసి మెప్పించాలని, తాము మెప్పించాము కాబట్టే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాకు మాత్రమే కాంగ్రెస్‌ వాళ్లు పరిమితమయ్యారని అన్నారు.

కానీ తాము ప్రజల మనసులో ఉన్నామని చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.సీడబ్ల్యూసీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి దేశంలో అతి తొందరగా పూర్తి చేస్తున్న ప్రాజెక్టు అని వారు కితాబు ఇచ్చారని గుర్తు చేశారు.  తాము కొన్ని కులాల వారి మనసులో చోటు సంపాదించుకున్నామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం ద్వారా అయినా ప్రజల మనసు దోచుకున్నారా.. వారు చేయకుండా మమ్ముల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు.

నిరుద్యోగ భృతి ఎలా ఇయ్యాలో తమకు తెలుసునన్నారు. ఒక్కసారి రుణమాఫీ చేసే విషయంపై ఆర్‌బీఐని అడిగామని, మళ్లీ అడుగుతామని..ఆర్‌బీఐ అనుమతి ఇస్తే మొత్తం అంతా ఒక్కసారే రుణమాఫీ చేస్తామని, లేకపోతే 4 ఏండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంచే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వివరించారు.

మరిన్ని వార్తలు