లష్కర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం

10 Mar, 2019 09:23 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కంటోన్మెంట్‌:  సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయబోతున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 13న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనున్న ఇంపీరియెల్‌ గార్డెన్స్‌ను మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్‌   పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయున్నారని అన్నారు. సన్నాహక సమావేశానికి 15వేలకు మంది వస్తారని తాము భావిస్తున్నప్పటికీ కేడర్‌లో కేటీఆర్‌ పట్ల ఉన్న జోష్‌ దృష్ట్యా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

మిత్ర పక్షం ఎంఐఎం పోటీ చేయనున్న హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఆరు చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాంపల్లిలోనూ మిత్ర పక్షం ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ విషయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య పోటీ నెలకొందన్నారు. అయితే ఈ సారి ఆయా ఎమ్మెల్యేలను తమ సొంత నియోజకవర్గానికి బదులుగా, మరో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకున్న బీజేపీ అడ్రస్‌ దాదాపు గల్లంతయిందన్నారు.  కార్యక్రమంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, తలసాని సాయికిరణ్‌ యాదవ్,  టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు