వానొస్తే విమానాలు మాయం!

15 May, 2019 04:09 IST|Sakshi

మోదీ వ్యాఖ్యలకు వెటకారంగా స్పందించిన రాహుల్‌

ఉజ్జయిని/నీముచ్‌: దేశంలో వర్షం వచ్చిన ప్రతిసారీ విమానాలన్నీ రాడార్లకు చిక్కకుండా మాయమవుతున్నాయా? అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. చివరిదశ ఎన్నికల కోసం రాహుల్‌ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఉజ్జయిని, ఖండ్వా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. మోదీ మాట్లాడుతూ పాక్‌లోని బాలాకోట్‌పై వాయుసేన దాడుల సమయంలో భారత విమానాలను పాకిస్తానీ రాడార్లు గుర్తించకుండా మేఘాలు సాయం చేశాయనీ, మేఘాలు దట్టంగా ఉన్నప్పుడే దాడి చేయాలని తానే వాయుసేనను ఆదేశించానని చెప్పడం తెలిసిందే.

అనంతరం మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ పలు పార్టీల నేతలు, నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు.  నటుడు అక్షయ్‌ కుమార్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తనకు మామిడి పండ్లు అంటే ఇష్టమనీ, చిన్నప్పుడు చెట్లెక్కి పండ్లు కోసేవాడినని మోదీ చెప్పారు. మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందిస్తూ ‘మేఘాలు విమానాలను రాడార్ల నుంచి దాయడం గురించి, మామిడి కాయలు కోయడం గురించి మోదీ మాట్లాడుతున్నారు. కానీ పనికొచ్చే విషయాలు, అసలైన సమస్యలపై ఆయన ఏమీ మాట్లాడటం లేదు. 

మోదీ కుటుంబంపై మాట్లాడను.. 
తాజా ఎన్నికల ప్రచారంలో మోదీ తమ ముత్తాతను (జవహర్‌లాల్‌ నెహ్రూ), నానమ్మను (ఇందిరా గాంధీ), తండ్రిని (రాజీవ్‌ గాంధీ) అవమానిస్తూ, వారిపై ఆరోపణలు చేస్తూ వ్యాఖ్యానించారనీ, కానీ తాను మాత్రం మోదీ తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను ఏమీ అనలేదనీ, అనబోనని పేర్కొన్నారు. ‘మోదీ ద్వేషంతో మాట్లాడతారు. మా ముత్తాత నుంచి అందర్నీ అవమానిస్తారు. కానీ నేను నా జీవితంలో ఎప్పుడూ అలా చేయను.

నేను చావనైనా చస్తాను గానీ మోదీ తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడను. ఎందుకంటే నేను ఆరెస్సెస్‌ లేదా బీజేపీ మనిషిని కాను. నాపై ద్వేషం చూపితే నేను ప్రేమను పంచుతా’ అని రాహుల్‌ అన్నారు. రఫేల్‌ ఒప్పందంలో మోదీ దొంగతనానికి పాల్పడ్డారనీ, ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలన్న తన సవాల్‌ను ఆయన స్వీకరించలేదని  అన్నారు. తనతో బహిరంగ చర్చ జరిగిన 15 నిమిషాల అనంతరం మోదీ తన మొహాన్ని దేశ ప్రజలకు చూపించలేరని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా