కాంగ్రెస్‌ కూటమిలో చేరితే రాజీనామా చేస్తా

24 May, 2018 19:10 IST|Sakshi
ఆప్‌ ఎమ్మెల్యే హెచ్‌ ఎస్‌ పుల్కా

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కూటమిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేరితే పార్టీకి రాజీనామా చేస్తానని ఆప్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ న్యాయవాది హెచ్‌ ఎస్‌ పుల్కా తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను బహిరంగంగానే హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. 1984లో సిక్కులపై కాంగ్రెస్‌ జరిపిన దాడులు త్రీవమైన విషయమన్నారు. ఆ కేసు తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఆప్‌ కనుక కాంగ్రెస్‌ కూటమిలో చేరితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి అరవింద్‌ కేజ్రివాల్‌ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి కేజ్రీవాల్‌ వేదిక పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పుల్కా ఈ హెచ్చరిక చేశారు. 

1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వేలాదిమంది సిక్కులు బాధితులయ్యారు. వారికి న్యాయం చేయడానికి పుల్కా పోరాటం చేశారు. ఆయన గత ఏడాది పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
 

మరిన్ని వార్తలు