ఇప్పటివరకు 666 మంది అభ్యర్థులే..!

22 Mar, 2019 09:53 IST|Sakshi

1957 లోక్‌సభ ఎన్నికల్లో 45 మంది మహిళలే పోటీ 

2014నాటికి 666కి చేరిన మహిళా అభ్యర్థులు  

పోటీ చేసే అతివల సంఖ్య పెరిగినా గెలిచేవారు కొందరే 

ఎన్నికల్లో గెలుపునకు మహిళామణుల ఓట్ల కోసం ఫీట్లు చేసే పార్టీలు సీట్ల కొచ్చేసరికి ప్లేటు ఫిరాయిస్తున్నాయి. అతివల ఓట్లతో గట్టెక్కిన ఈ నేతలు చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అనేసరికి అడ్డుపుల్ల వేస్తున్నారు. మూడోవంతు మాటెలా ఉన్నా మన చట్ట సభల్లో మహిళామణుల వాటా కనీసం పదోవంతు కూడా దాటడం లేదు. స్వాతంత్య్రం అనంతరం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతున్నా అది నామమాత్రమే. పార్టీలు మహిళలకు టిక్కెట్లిస్తున్నా ప్రత్యర్థుల అంగబలం, అర్థబలం ముందు వారు నిలబడలేకపోతున్నారు. 

1957 నుంచి లోక్‌సభకు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే మహిళలకు జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్ని పెంచాయి. 1957లో లోక్‌సభకు పోటీచేసిన మహిళల సంఖ్య రెండంకెలు ఉంటే.. ఇప్పుడది మూడంకెలకు చేరింది. అయితే గెలుపొందే మహిళల సంఖ్య మాత్రం రెండంకెలు దాటడం లేదు. స్వతంత్రులుగా బరిలో దిగితే వారి విజయం కష్టమే. 1967 లోక్‌సభ ఎన్నికల్లో పది మంది మహిళలు స్వతంత్రులుగా పోటీ చేస్తే ఇద్దరు విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో 78 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగితే ఒకరు మాత్రమే గెలుపొందారు.

1996లో నల్గొండ నుంచి  60 మంది మహిళల పోటీ 
2009లో దేశవ్యాప్తంగా 556 మంది మహిళలు లోక్‌సభకు పోటీ చేయగా 59 మంది విజయం సాధించారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎన్నికయ్యారు. 2014లో 668 మంది పోటీ చేస్తే 62 మంది గెలుపొందగా, రాష్ట్రం నుంచి 43 మంది బరిలో ఉంటే ముగ్గురు మాత్రమే విజయం దక్కించుకున్నారు. ఫ్లోరైడ్‌ సమస్యను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో 1996లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి జలసాధన సమితి తరపున 60 మంది మహిళలు స్వతంత్రులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 90 మంది మహిళలు పోటీ చేస్తే ముగ్గురు విజయం సాధించారు.  
– పి. మాణిక్యాలరావు, సాక్షి, అమరావతి

మరిన్ని వార్తలు