ఓట్లు పెరిగాయి మరి సీట్లేవీ?

24 Mar, 2019 08:13 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ : తొట్టతొలి ఎన్నికల నుంచి నేటి వరకూ ప్రతి ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. ఓటుహక్కుని వినియోగించుకొంటోన్న స్త్రీల సంఖ్య క్రమేణా పెరుగుతోన్నా, రాజకీయ భాగస్వామ్యం మాత్రం స్త్రీలకు అందనంత దూరంలోనే ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మహిళలకి సీట్ల కేటాయింపులో కొంత పరిణతి కనపడుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది.

ఆ తరువాత తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా దీదీ మహిళలకు 41 శాతం సీట్లిచ్చి తాను మహిళా పక్షపాతినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. శతాబ్దాలుగా రాజకీయాల్లో మహిళలకు వారి వాటా వారికి దక్కని పరిస్థితుల్లో ఈ రెండు ప్రకటనలూ భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి పునాదిగా నిలవబోతున్నాయి. 

మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంకాగాంధీ వాద్రా భారత రాజకీయాల్లో బాగా రాణిస్తోన్న నేటి తరుణంలో కూడా క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వానికి ఆమోదం అంతంతగానే ఉంది. ప్రత్యక్షంగా స్త్రీలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్త్రీల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. 1962 నుంచీ దేశంలో స్త్రీల ఓట్ల శాతం మొత్తం ఓట్లలో దాదాపు సగభాగంగా ఉన్నా 47 నుంచి 48 శాతమే పోలవుతున్నాయి.

పురుషులకన్నా ఓటుహక్కును వినియోగించుకునే స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. 2014లో పోలైన మొత్తం ఓట్లలో మహిళా ఓటర్లు 65 శాతం ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ గణాంకాల ప్రకారం 1967 నుంచి ఇంత అధికసంఖ్యలో మహిళలు ఓటుహక్కుని వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 2014లోనే  పురుషుల పోలింగ్‌ శాతం 67గా ఉంది. జమ్మూ కశ్మీర్‌లో 2014లో అతి తక్కువగా 48 శాతం మాత్రమే మహిళల ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్, లక్షద్వీప్‌లో అత్యధికంగా 88 శాతం మహిళల ఓట్లు పోలయ్యాయి.

పెరుగుతున్న స్త్రీల ఓటింగ్‌ శాతం

ప్రణయ్‌రాయ్, దోరబ్‌ సుపారీవాలా ఇటీవల విడుదల చేసిన పుస్తకంలో పెరిగిన మహిళల ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. 2017, 18 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ శాంతి సంస్థ కార్నేగీ ఎండోమెంట్‌ ప్రకారం ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి చాలా కారణాలున్నాయి.

అందులో ప్రధానమైనవి మహిళల నిర్ణాయకశక్తి, అక్షరాస్యత పెరగడం. భారత ఎన్నికల కమిషన్‌ సైతం ఎక్కువమంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ప్రత్యేక వరుసలు, ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు, పింక్‌ బూత్‌ల పేరుతో సౌకర్యాలు కల్పిస్తోంది. 

ఓటూ లేదు.. సీట్లూ లేవు..
2014లో 65 శాతం మహిళల ఓట్లు పోలైనా.. ఇంకా అధికసంఖ్యలో స్త్రీలు ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. 2011 సెన్సెస్‌ ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి 943 మంది మహిళా ఓటర్లున్నారు. 2019 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకి కేవలం 925 మంది మహిళా ఓటర్లే ఉన్నట్టు తేలింది. ఇదే వివక్ష పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని సైతం ప్రతిబింబిస్తోంది. లోక్‌సభలోని మొత్తం 524 సీట్లలో 66 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో ఎక్కువమంది (32) బీజేపీ నుంచే ఉన్నారు.

1952లో లోక్‌సభలో మహిళల సంఖ్య 22. 2014 ఎన్నికల నాటికి ఇది 61కి పెరిగింది. ప్రతి పది మంది లోక్‌సభ సభ్యుల్లో 9 మంది     పురుషులుండటం లింగవివక్షకు నిదర్శనం. ప్రపంచ స్థాయిలో చట్టసభల్లో మహిళల సగటు భాగస్వామ్యం 20 శాతం ఉంది. అయితే మన దేశంలో 1952లో 4.4 శాతం ఉండగా, 2014 నాటికి 11 శాతానికి చేరింది. సీట్ల పంపకంలో జాతీయ రాజకీయ పార్టీలు వివక్షను పాటిస్తూనే ఉన్నాయి. మహిళలు గెలవలేరనే భావంతో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్త్రీలకు సీట్లు కేటాయించడం లేదు.

అయితే, మహిళలకు సీట్ల కేటాయింపులో కొంతలో కొంత కాంగ్రెస్‌ ముందుంది. 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 355 మంది మహిళలు పోటీ చేయగా 45 మందే (కాంగ్రెస్‌–12, బీజేపీ–10, ఇతరులు– 23 మంది) గెలిచారు. 2009 ఎన్నికల్లో 556 మంది పోటీచేయగా 59 మంది (కాంగ్రెస్‌–23, బీజేపీ–13, ఇతరులు–23) గెలిచారు.  2014 ఎన్నికల్లో 668 మంది మహిళలు పోటీచేయగా 61 మంది  (కాంగ్రెస్‌–4, బీజేపీ–28, ఇతరులు–29) గెలిచారు.  

మరిన్ని వార్తలు