సొంతిల్లు సాకారం పెద్దాయన చలవే..

13 Mar, 2019 11:57 IST|Sakshi
పడమరఖండ్రికలో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభిస్తున్న వైఎస్‌ (ఫైల్‌)

సాక్షి, మండపేట:  ప్రతి పేదవాడూ కలలు కనేది సొంతింటి కోసమే. తన సొంత ఇంటిలో ప్రశాంతంగా జీవించాలని సంబరపడుతుంటారు. అధికారంలోకి వచ్చిందే తడవు పేదల కలను సాకారం చేసి చూపించారు దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. పేదవర్గాల వారి అద్దె ఇంటి వెతలు తీర్చేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. మూడు విడతలుగా అమలుచేసే ఈ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేసిన వైఎస్‌ దాదాపు రూ.743.96 కోట్లు విడుదల చేశారు.

వైఎస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని 2006 ఏప్రిల్‌ 1వ తేదీన కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ప్రారంభించారు. అప్పటి వరకు అర్బన్‌ ప్రాంతాల్లో రూ.30 వేలు, రూరల్‌ ప్రాంతాల్లో రూ.22,500 ఉన్న గృహనిర్మాణ సాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా అర్బన్‌లో రూ.55 వేలు, రూరల్‌లో రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్‌లో రూ.75 వేలు, రూరల్‌లో రూ.65 వేలకు పెంచారు.

మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సొంత స్థలాలు లేని పేదవర్గాల కోసం కోట్లాది రూపాయల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు సేకరించారు. ఇందిరమ్మ మూడు దశల్లో భాగంగా స్థలాలు మెరక పనులు చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేశారు. మూడు విడతల్లోను మొత్తం జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేశారు. అందుకోసం సుమారు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. పేదవర్గాల వారి సొంతింటి కలను సాకారం చేస్తూ వీటిలో సుమారు 1.95 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 


మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంత ప్రాంతంలో రెండు విడతలుగా రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలు సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం. తొలి విడతలో సేకరించిన 55.77 ఎకరాల్లో మెరక పనులు పూర్తి కాగా ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున 2009 ఫిబ్రవరి 27న పట్టాల పంపిణీని వైఎస్‌ ప్రారంభించారు. 1979 ప్లాట్లుగా విభజించి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలో 1834 మందికి గృహనిర్మాణ రుణాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 1200కు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ద్వారా వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు వైఎస్‌. పేదల సొంతింటి కలను సాకారం చేసిన దివంగత వైఎస్‌ దివికేగి ఏళ్లు గడుస్తున్నా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 

పక్కా ఇళ్లకు ‘చంద్ర’గ్రహణం 
పేదల పక్కా ఇళ్లకు నేడు చంద్రగ్రహణం పట్టింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఎన్‌టీఆర్‌ గృహనిర్మాణం పేరిట పక్కా ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు జిల్లాకు కేవలం 64,647 ఇళ్లు మంజూరు చేయడం పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. రూ.1.5 లక్షల ఆర్థిక సాయమంటూ మూడేళ్లలో ఆయా ఇళ్లకు కేటాయించింది రూ.594.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు రూ. వంద కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉన్నట్టు అంచనా.

మూడేళ్లలో... మంజూరైన ఇళ్లు  నిధులు   నిర్మాణం పూర్తయినవి   నిర్మాణంలో ఉన్నవి  
వైఎస్‌ హయాంలో..    2,14,205   రూ. 743.96 కోట్లు    1,99,890     14,315
చంద్రబాబు హయాంలో..   64,647   రూ. 594.75  కోట్లు  46,614      11,998        

మరిన్ని వార్తలు