పరిటాల శ్రీరామ్‌కు ఎలా అనుమతిచ్చారు?

26 Mar, 2019 12:05 IST|Sakshi

ట్విటర్‌లో వైస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్.. 20 వాహనాల కాన్వాయ్‌తో వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎలక్షన్ అధికారులు అన్ని వాహనాలకు ఎలా అనుమతి ఇచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అనుమతి లేకుంటే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసునమోదు చేయాలని ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. జనసేనతో లోపాయికారి పొత్తు వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు అర్థమైందన్నారు. పార్టనర్ల దొంగాటను ప్రజలు గ్రహించడంతో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలక్షన్ ఏకపక్షంగా ఉండబోతోందని, భారీ ఓటమి నుంచి తప్పించుకోలేరని, జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. 

‘వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత దాన్ని కాపీ కొట్టి తెలుగుదేశం హామీలు వెల్లడిస్తామని ధైర్యంగా చెప్పొచ్చు కదా చంద్రబాబు...’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నవరత్నాలను కాపీ పేస్ట్ చేశారని, పక్క రాష్ట్రం పథకాలను ఎత్తేశారని ధ్వజమెత్తారు. సొంత మేనిఫెస్టో ప్రకటించలేని దయనీయ స్థితి ఏమిటి బాబూ? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్‌.. పగలబడి నవ్వుతున్నారు..
‘రూ.52 కోట్ల ఆస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో చూపిన వ్యక్తి ఈత చాపపై కూర్చుని మట్టి పిడతలో అన్నం తినడం డ్రామా కాక మరేమవుతుంది. 30-40 ఏళ్ల కింద ఇటువంటి వేషాలు వేస్తే జనాలు నమ్మేవారేమో. మహాత్మా గాంధీ అంత సాధారణ వ్యక్తినని షో చేస్తే ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు.’ అని సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు