‘రాహుల్‌ నీకు ధైర్యం ఉంటే నన్ను కౌగిలించుకో’

24 Jul, 2018 17:57 IST|Sakshi
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌

లక్నో : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ‘రాహుల్‌ నీకు దమ్ముంటే నన్ను కౌగిలించుకో’ అంటూ సవాల్‌ కూడా విసిరారు. తనను ఆలింగనం చేసుకోవాలంటే రాహుల్‌ కనీసం ఓ పది నిమిషాలైనా ఆలోచించుకోవాల్సిందే అన్నారు.

లోక్‌సభలో రాహుల్‌ గాంధీ నరేంద్ర మోదీని కౌగిలించుకున్న విషయం గురించి ప్రస్తావిస్తూ ‘ఒక వేళ రాహుల్‌ గాంధీ మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటే మీరు ఎలా స్పందిస్తారు’ అని అడగ్గా ‘ఇలాంటి జిమ్మిక్కులన్ని నా దగ్గర కుదరవు. ఇలాంటి చర్యలను నేను ఎన్నటికి ఆమోదించను. రాహుల్‌ పనులు చిన్న పిల్లల చేష్టల లాగున్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరూ ఇలా చేయరు. రాహుల్‌కు నిర్ణయం తీసుకునే సామార్ధ్యం, తెలివితేటలు లేవని’ విమర్శించారు.

కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ తన ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు వెళ్లి హఠాత్తుగా ఆయనను కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఇలాంటి పిల్ల చేష్టలు చేసే రాహుల్‌ గాంధీని ప్రతిపక్షాలు ఎలా స్వీకరిస్తాయి. ఇక ఇప్పుడు అఖిలేయ్‌ యాదవ్‌, మయావతి, శరద్ పవర్ రాహుల్‌ గాంధీతో కలిసి పనిచేస్తారా? అని ప్రశ్నించారు.

మూక దాడులపై స్పందిస్తూ.. గో రక్షకుల పేరుతో చేసే ఇలాంటి ఘటనలను తాను అంగీకరించబోనని స్పష్టంచేశారు. అంతే కాక గోవుల అక్రమ రవాణాను, గోవధను కూడా తాను సహించబోనని యోగి తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు