పోలీసులు సెల్యూట్‌ చేయాల్సింది మూడు సింహాలకు

12 Feb, 2019 04:49 IST|Sakshi
అనంతపురం సమర శంఖారావం సభలో వేదిక దిగి వచ్చి పార్టీ బూత్‌ కమిటీల సభ్యులు, కన్వీనర్లతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు కాదు..

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కార్యకర్తలపై అన్యాయంగా పెట్టిన కేసులన్నీ ఉపసంహరిస్తాం

హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని అందరికీ చెప్పండి

ఆయన యూటర్న్‌ తీసుకోడానికి కారణం మనమేనని చెప్పండి

అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతి పోలీసు సోదరుడు సెల్యూట్‌ చేయాల్సింది తమ టోపీపై ఉన్న మూడు సింహాలకేనని, ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు కాదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో సోమవారం జరిగిన సమర శంఖారావం సభలో ఆయన పార్టీ బూత్‌ కమిటీల సభ్యులు, కన్వీనర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అధికార పార్టీ నేతలు పోలీసుల సాయంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఓ కార్యకర్త చెప్పగా.. ఆయన పైవిధంగా స్పందించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక విపక్ష కార్యకర్తలపై పెట్టిన దొంగ కేసులన్నింటినీ ఉపసంహరిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు దీక్షలు.. కరవు పరిస్థితులు, ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు.. తదితర అంశాలపై బూత్‌ కమిటీ సభ్యుల ప్రశ్నలకు జగన్‌ సవివరంగా సమాధానాలిచ్చారు. సభ్యుల ప్రశ్నలను.. హిందూపురం పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ జగన్‌కు చదివి వినిపించారు. 

ప్రశ్న: నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో దొంగ దీక్ష చేస్తున్నారు. మన కార్యకర్తలు ఎలా ఎదుర్కోవాలి?
– ఎం.నారాయణ (పుట్టపర్తి)
జగన్‌: ఇవాళ ప్రత్యేక హోదా అనే పదం చంద్రబాబు నోటి నుంచి మళ్లీ పుట్టుకొచ్చిందంటే దానికి కారణం మనమేనని గట్టిగా చెప్పండి. ఏపీ అసెంబ్లీలో ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ మాట్లాడాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుచేయండి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో చేస్తూ.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అన్న చంద్రబాబు మాటలను అందరికీ చెప్పండి. హోదా కావాలని ఎవరైనా అంటే వారిని జైళ్లల్లో పెట్టండి.. అని చంద్రబాబు హుకుం జారీచేసిన మాట నిజం కాదా.. అని చెప్పండి. ఈ రోజు ఎన్నికలొచ్చేటప్పటికి యూటర్న్‌ తీసుకుని, నల్ల చొక్కా వేసుకుని.. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అని అంటున్నారంటే.. దానికి కారణం మా జగనన్న అని గట్టిగా చెప్పండి. 

ప్రశ్న: కియా కార్ల ఫ్యాక్టరీకి మేం భూములిచ్చాం. భూములు పోయాయి.. కానీ మాకు ఉద్యోగాలు మాత్రం రాలేదు. మీ నుంచి మాకు భరోసా కావాలి.
– సత్యనారాయణ (పెనుగొండ) 
జగన్‌: కియా ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు ఉచితంగా ఇచ్చాం. ఎంతో ఖర్చు పెట్టి వాటిని అభివృద్ధి చేశారు. రాయితీకి కరెంటు ఇచ్చారు. ఇంకా అనేక రాయితీలిచ్చారు. ఆ ఫ్యాక్టరీకి అన్నీ ఇచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మనం అడుగుతాం.. కానీ చంద్రబాబు హయాంలో ఐదు శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయని సత్యనారాయణ చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పిల్లవానికీ ఇదే చెబుతున్నా.. మరో మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొట్టమొదటి చట్టసభలోనే పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టం తెస్తాం. మరో మూడు నెలల్లో కంపెనీల వాళ్లు తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న ఉద్యోగులను వెనక్కి పంపి.. మన వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. 

ప్రశ్న: టీడీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తన జేబు సంస్థగా వాడుకుని మా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగజేస్తోంది. అంతే కాదు.. విపక్ష కార్యకర్తలను వేధిస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాస్‌ (అనంతపురం అర్బన్‌) 
జగన్‌: ప్రతి పోలీసు సోదరునికీ నేనిదే విజ్ఞప్తి చేస్తున్నా.. మనం సెల్యూట్‌ కొట్టాల్సింది మన టోపీ మీదున్న మూడు సింహాలకుగానీ.. ఆ టోపీ వెనకాల ఉన్న గుంట నక్కలకు కాదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక దొంగకేసులను ఉపసంహరిస్తామని హామీ ఇస్తున్నా. 

ప్రశ్న: తీవ్రమైన కరవు పరిస్థితుల బారిన పడిన మా ప్రాంత రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా మోసం చేశారన్నా. ఆయన ఏ మాత్రం రైతులను ఆదుకోలేదన్నా..
– బోయ తిరుపాలు (ఉరవకొండ) 
జగన్‌: కరువు జిల్లా అయిన అనంతపురంలోని పార్టీ కార్యకర్తలందరికీ ఇదే చెబుతున్నా.. గ్రామాల్లో ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్నలందరికీ చెప్పండి.. ఇదే జిల్లాలో నేను పాదయాత్రకు వచ్చినప్పుడు పుట్టపర్తిలో శివన్న అనే రైతు నా దగ్గరకొచ్చి తన కష్టం చెప్పాడు. ఆయన ఓ పేద రైతు. వేరుశనగ పంట వేస్తే అది పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతలో చంద్రబాబు వస్తున్నారని అధికారులొచ్చారు. ఓ గుంత తవ్వి టార్ఫాలిన్‌లు కప్పారు. నాలుగు ట్రాక్టర్లతో వచ్చి నీళ్లు చల్లారు. చంద్రబాబు పిట్టల దొర మాదిరి వచ్చి ఆ గుంతలో రెయిన్‌గన్‌ పెట్టి ఓ బటన్‌ ఆన్‌చేశాడు. అలా అలా నీళ్లు చల్లి, ‘నీ పంటను కాపాడేశాను’ అని శివన్నతో చెప్పాడు. శివన్న కూడా తన పంట కాపాడారని సంతోషపడ్డాడు. చంద్రబాబు వెళ్లి పోయాక శివన్న కూడా ఇంటికి భోజనానికి వెళ్లిపోయాడు. సాయంత్రం మళ్లీ పొలానికి వచ్చి చూస్తే.. రెయిన్‌ గన్నూ లేదు.. టార్ఫాలిన్‌ పట్టా లేదు.. అధికారులు లేరు.. చంద్రబాబూ లేడు. ఆ తర్వాత ఆ పొలం ఎండిపోయింది. పాపం శివన్న ఇప్పుడు బొరుగులు (మరమరాలు) అమ్ముకుంటూ జీవిస్తున్నాడు.

తన అప్పులను చంద్రబాబు మాఫీ చేస్తానని చేయకుండా మోసం చేసినందుకు.. తనకు ఈ పరిస్థితి వచ్చిందని శివన్న నాతో చెబుతూ.. ‘వద్దప్పా.. చంద్రబాబుతో సావాసం’ అని ఉసూరుమన్నాడు. శివన్న చెప్పిన ఈ మాటలు ఊర్లలో ప్రతి రైతన్నకూ చెప్పండి. హంద్రీ–నీవా ప్రాజెక్టు కడుతున్నారుగానీ అందుకు సంబంధించిన పిల్ల కాలువల నిర్మాణం అయిపోదు.. కాబట్టి మన భూముల్లోకి నీళ్లు రావు. చంద్రబాబు పుణ్యాన ఈ ఐదేళ్లల్లో ఆయనతో పాటుగా వచ్చిందేంటంటే.. కరువే అన్న సంగతి చెప్పండి. ఈ సంవత్సరమూ కరువొచ్చింది.. ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి అయినా ఇన్‌పుట్‌ సబ్సిడీగా మీకు వచ్చిందా.. అని రైతులను అడగండి. చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికే పుట్టాడు. ఈ మనిషి అధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఏ మేలు జరగదని వారికి గట్టిగా చెప్పండి.

ప్రశ్న: ఈ జిల్లాకు వైఎస్సార్‌ చాలా మంచి పనులు చేశారు. మీరు కూడా అదే స్థాయిలో చేయాలన్నది మా కోరిక. 
– ఖాదర్‌ బాషా (కదిరి)  
జగన్‌: పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. జగన్‌ రెండడుగులు ముందుకేస్తాడని కచ్చితంగా హామీ ఇస్తున్నాను. రేపు మీ అందరి దీవెనలతో, దేవుడి ఆశీర్వాదంతో మనందరి ప్రభుత్వం వచ్చాక నాన్నగారి కన్నా గొప్పగా పరిపాలిస్తాను. నేను చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో నాన్నగారితో పాటు నా ఫొటో కూడా ఉండేంత గొప్పగా పరిపాలిస్తానని మీకు హామీ ఇస్తున్నా. 

మరిన్ని వార్తలు