నంబర్‌ వన్‌ చీటర్‌ అవార్డు బాబుకే 

11 Oct, 2018 03:34 IST|Sakshi
విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ఈ పెద్దమనిషికి ఉత్తమ చెత్త సీఎం అవార్డు ఇవ్వాలి.. గజపతినగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

రైతు ద్రోహికి వ్యవసాయ అవార్డులా? 

అదీ బీజేపీ మంత్రి చేతుల మీదుగానా? 

అవార్డుకే అవహేళన కాదా? 

నంబర్‌ వన్‌ రైతు వ్యతిరేకి బాబేనని రైతన్నలు ఏకగ్రీవ ఆమోదం

బాబొస్తే కరవే.. అందుకే ఉత్తమ కరవు రత్న అవార్డు ఇవ్వాలని ఎద్దేవా  

అంబులెన్స్‌ల కొనుగోలులోనూ దోపిడే 

మనందరి ప్రభుత్వం రాగానే రైతులను ఆదుకుంటామని భరోసా

ఈ పెద్దమనిషి వ్యవసాయం దండగన్నాడు. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంట్‌ తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ప్రాజెక్టులు కడితే ఖర్చు తప్ప రాబడి ఉండదన్నదీ ఈయనే. సబ్సిడీలు పులిమీద సవారీలాంటివని ఆయన అనడమే కాకుండా..ఏకంగా తన పుస్తకంలో రాసుకున్నాడు. రైతుకు సంబంధించిన అవార్డు ఇలాంటి వ్యక్తికివ్వడం ఆ అవార్డును అవహేళన చేసినట్టు కాదా?
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘వ్యవసాయమే దండగన్న చంద్రబాబుకు వ్యవసాయ పురస్కారమా? ఆయనకు ఈ అవార్డు ఇవ్వడమంటే తాగొచ్చి భా ర్యను కొట్టే వ్యక్తికి ఉత్తమ భర్త అవార్డు ఇచ్చినట్టే. నిజంగా ప్రపంచంలో నంబర్‌ వన్‌ చీటర్‌ అవార్డు అనేది ఏదైనా ఉంటే.. అది చంద్రబాబుకే ఇవ్వాలి. రైతన్నను దోచుకునే దళారిగా మారిన ఆయనకు అత్యుత్తమ దళారి అవార్డు ఇవ్వాల్సిందే. ఆయనొస్తేనే కరవు.. అందుకే కరవు రత్న అవార్డివ్వాలి సహకార వ్యవస్థనే నాశనం చేసినందుకు సహకార రంగ ద్రోహి అవార్డివ్వాలి. రైతన్న దయనీయ స్థితిని పట్టించుకోని ఈయనకు కలియుగ కుంభకర్ణ అవార్డు కూడా ఇస్తే తప్పేంటి?’ అంటూ విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 283వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా గజపతినగరం సభలో భారీ జనసందోహాన్నుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రజల కోసమే జీవించాలని.. వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని భావోద్వేగంతో చెప్పారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 
 
బీజేపీ, బాబు బంధానికి ఇదే నిదర్శనం 
‘‘ఈ ఏడాది చంద్రబాబుకు అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం ఇస్తున్నట్టుగా పేపర్లలో చూసి ఆశ్చర్యమేసింది. ఆయన ఎల్లో మీడియా దీన్ని మరింత ఊదరగొడుతోంది. ఇందులో విశేషమేంటో తెలుసా? ఆయనకు ఈ పురస్కారం ఇచ్చేదెవరో తెలుసా? బీజేపీకి చెందిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇస్తారట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఇదే మంత్రి ఇదివరకు లోక్‌సభ సాక్షిగా ఏమన్నారో గుర్తుందా? చంద్రబాబు నాయుడు ఎన్నటికీ మా మిత్రుడే అన్నాడు. ఇదే మంత్రి ఇప్పుడు చంద్రబాబుకు పురస్కారం ఇస్తున్నారంటే.. వీరి మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? వ్యవసాయంలో చంద్రబాబుకు అవార్డివ్వడమంటే.. తాగొచ్చి రోజూ భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అని అవార్డివ్వడమంత దారుణంగా ఉంది. నంబర్‌ వన్‌ రైతు వ్యతిరేకి ఎవరని అడిగితే.. ప్రతి రైతు నోట్లోంచి ఏకగ్రీవంగా వచ్చే పేరు నారా చంద్రబాబునాయుడు అని. ఇలాంటి వ్యక్తికి వ్యవసాయ అవార్డా! 
 
బొంకినందుకు కాబోలు.. 
ఈ మధ్య చంద్రబాబు నదులు అనుసంధానం చేసిన మొదటి ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకుంటున్నాడు. ఆ మాటలు వింటే ఆశ్చర్యమేస్తోంది. వైఎస్సార్‌ కట్టిన పోలవరం కుడికాల్వ ద్వారా చెంబుడు నీళ్లు పోసి అనుసంధానం నేనే చేశానని బొంకే ఈయన్ను ఏమనాలి? ఇలాంటి అబద్ధాల వ్యక్తికి ఏ అవార్డివ్వాలి? రెయిన్‌గన్లతో కరవును జయించానని వీర బొంకడం మనందరికీ కన్పిస్తోంది. వైఎస్సార్‌ హయాంలోని వ్యవసాయాభివృద్ధితో ఈయన కాలాన్ని పోలిస్తే.. చంద్రబాబు హయాంలో ఒక్క ఎకరాకు నీరు అదనంగా రాకపోగా, సాగు తగ్గిపోయింది. ఒక్క టన్ను అదనంగా పండలేదు సరికదా.. వైఎస్‌ హయాంలో ఉన్న పంట దిగుబడి తగ్గిపోయింది. 2008 – 09 వైఎస్సార్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 71.02 లక్షల హెక్టార్లలో సాగు జరిగితే.. చంద్రబాబు హయాంలో 2017 – 18లో సాగు విస్తీర్ణం 59 లక్షలకు పడిపోయింది. వైఎస్సార్‌ హయాంలో 2008 – 09లో 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటే, పదేళ్ల తర్వాత అది పెరగాల్సింది పోయి 2017 – 18లో 157 లక్షల టన్నులకు పడిపోయింది. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడీ పెద్దమనిషి. ఎన్నికలయ్యాక రైతులను మోసం చేశాడు. 2014 మార్చి 31న ఈయన సీఎం అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లుంటే, అవి తడిసి మోపెడై రూ.1.26 లక్షల కోట్లకు చేరాయి. ఇలాంటి వ్యక్తికి పురస్కారం, అవార్డులిస్తున్నారట.  
 
అత్యుత్తమ దళారీ అవార్డు ఇవ్వాలి 
అన్యాయమైన పాలన చేస్తున్న, రైతులను నిలువునా మోసం చేసిన చంద్రబాబుకు ఎలాంటి అవార్డివ్వాలి? ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చీటర్‌ అవార్డుంటే.. అది ఈయనకే ఇవ్వాలి. ఈమధ్య నాబార్డు ఓ రిపోర్టు ఇచ్చింది. రైతుల నెలవారీ సగటు ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 28వ స్థానంలో ఉందని వెల్లడించింది. దేశం మొత్తంలో రైతులకు ఉన్న అప్పుల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇలాంటి దారుణమైన ముఖ్యమంత్రికి ఏ అవార్డివ్వాలి? రైతుల ధాన్యాన్ని క్వింటాలు రూ.1,500కే కొంటారు. కేజీ రూ.15 చొప్పున మనదగ్గర కొని.. చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో మాత్రం కేజీ రూ.46కు అమ్ముతున్నారు. మార్కెట్లో ఉల్లిని కేజీ మూడు, నాలుగు రూపాయలకే కొంటున్నారు. హెరిటేజ్‌ షాపుల్లో రూ.20కి అమ్ముతున్నారు. కందిపప్పు రైతుల దగ్గర క్వింటాలు రూ.3,200కు కొని, తన హెరిటేజ్‌ షాపుల్లో కేజీ రూ.77.. అంటే క్వింటాలు రూ.7,700కు అమ్ముతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలిప్పించి, దళారీ వ్యవస్థకు కళ్లెం వేయాల్సిన చంద్రబాబు.. దళారీలకు ఆయనే నాయకత్వం వహిస్తున్నాడు. దగ్గరుండి మేలు చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి ప్రపంచపు అత్యుత్తమ దళారీ అవార్డు తక్షణమే ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకునే రైతులకు తోడుగా నిలబడాల్సింది పోయి.. వారు కుటుంబ కలహాలతో చనిపోతున్నారని చెప్పే ఈ పెద్దమనిషి దళారీ అవార్డుకు అర్హుడే.  
 
తోటపల్లికి చంద్ర గ్రహణం 
గజపతినగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది ఇక్కడి సమస్యలు నాకు చెప్పారు. ముఖ్యంగా తోటపల్లి ప్రాజెక్టు గురించి వివరించారు. చంద్రబాబు నాయుడుకు ఎన్నికలొచ్చినప్పడే తోటపల్లి ప్రాజెక్టు గుర్తుకొస్తుందన్నారు. శంకుస్థాపన చేసి, గాలికొదిలేస్తాడని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆయన దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పుడు తోటపల్లి గురించి రైతులు చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆయన హయాంలో ప్రాజెక్టును పరుగులు పెట్టించారని, 90 శాతం ఆయన కాలంలోనే పూర్తయిందని చెప్పారు. ముఖ్యమంత్రయిన చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా మిగిలిన ఆ పది శాతం పనులు కూడా పూర్తి చేయకుండా గాడిదలు కాస్తున్నాడని రైతన్నలు అన్నారు. 25 మండలాల్లో దాదాపు 1.35 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాల్టికీ 80 వేల ఎకరాలకు నీరందని పరిస్థితిలో ఉందన్నారు. గజపతినగరం ప్రజల కోసం నాన్నగారు తోటపల్లి నుంచి పిల్లకాల్వల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేసి, 25 శాతం పనులు పూర్తి చేశారని, చంద్రబాబు మాత్రం కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడని తెలిపారు. ఇలాగైతే నీళ్లెప్పుడొస్తాయని, ప్రాజెక్టు ఫలాలు ఎప్పుడందుతాయని రైతులు ఆవేదనతో చెప్పారు.   
 
అధోగతిలో ఆసుపత్రి 
గజపతినగరం నియోజకవర్గంలో ఉన్న సామాజిక ఆసుపత్రిని వంద పడకలకు పెంచుతామన్నారన్నా.. ఆ హామీ కథ దేవుడెరుగు.. అక్కడ ఆరు మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే, కేవలం నలుగురు మాత్రమే పని చేస్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పారు. జగన్‌ అనే వ్యక్తి విజయనగరంలోకి ప్రవేశించి, చీపురుపల్లి దాటాడని తెలిసి, రెండు రోజుల క్రితమే గైనకాలజిస్టును నియమించారని ఈ సిగ్గులేని ప్రభుత్వం గురించి ప్రజలు నాకు చెప్పారు. ఇక్కడ చిన్న పిల్లల డాక్టరే లేడని, ఉన్న ఒకే ఒక టెక్నీషియన్‌ డిప్యూటేషన్‌పై వెళ్లిపోయాడని చెప్పారు. బ్లాడ్‌ బ్యాంక్‌ లేదని, జనరేటర్‌ పని చేయడం లేదని, అంబులెన్స్‌లు మూలన పడ్డాయని, మార్చురీలో ఫ్రీజర్‌ కూడా లేని అధ్వాన్న పరిస్థితి ఉందన్నారు.  
 
అంబులెన్స్‌ల్లోనూ కోట్ల దోపిడీ 
108కు ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ రావాలని, పేదవాడిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లి, ఉచితంగా ఆపరేషన్‌ చేయించి, చిరునవ్వుతో పంపాలని నాన్నగారు గొప్పగా ఆలోచించి, తన హయాంలో 108ను తీసుకొచ్చారు. ఇప్పుడీ వాహనాల పరిస్థితేమిటి? మండలాని నాలుగుండాల్సినవి, ఒకే ఒక్కటి ఉందని ప్రజలు చెబుతుంటే.. ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? ఈమధ్య జరిగిన ఓ సంఘటనను స్థానికులు నా దృష్టికి తెచ్చారు. ఆండ్ర ప్రాంతానికి చెందిన గర్భిణి 108కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ అందుబాటులో లేదని చెప్పారట. గత్యంతరం లేక బస్సులో ప్రయాణిస్తూ రోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చిందన్నా.. అని తెలిపారు. 108 వాహనాల డీజిల్‌కు డబ్బులివ్వరని, ఉద్యోగులకు జీతాలుండవని, జీతాల బకాయిలు నెలలకొద్దీ పెండింగ్‌లో పెట్టారని, వాహనానలకు ఇన్సూరెన్స్‌ ఉండదని, అసలు వాటికి నిధులే ఇవ్వరన్నారని చెప్పారు.

చంద్రబాబు మాత్రం 108 నంబర్‌తో కుంభకోణాలు చేస్తున్నాడని ప్రజలు అన్నారు. రాష్ట్రంలో వాస్తవంగా 108 వాహనాలు 310 తిరుగుతుంటే, చంద్రబాబు కోర్‌ డ్యాష్‌ బోర్డులో 414 వాహనాలు తిరుగుతున్నట్టుగా లెక్కలు చూపిస్తున్నారు. తిరగని 104 వాహనాలు తిరుగుతున్నట్టు లెక్కలు చూపించి, బిల్లులు తీసుకుంటున్నారంటే, ఏ స్థాయిలో చంద్రబాబు లంచాలు మెక్కుతున్నాడో తెలుస్తోంది. ఇవే వాహనాల కొనుగోలుకు టాటా కంపెనీకి ఒక్కోదానికి రూ.12.60 లక్షలు కోట్‌ చేస్తే, తన బినామీల ద్వారా ఒక్కో వాహనం రూ.18 లక్షలకు కొనుగోలు చేస్తున్నాడు. నిజంగా ఇంతకన్నా లంచగొండి, సిగ్గుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? తెలంగాణ ప్రభుత్వం ఇదే అంబులెన్స్‌లను రూ.11.65 లక్షలకు కొనుగోలు చేస్తుంటే, ఈయన మాత్రం తన బినామీలకు రూ.18 లక్షలకు కాంటాక్టు ఇచ్చాడంటే ఏ స్థాయిలో ఈయన లంచాలు తింటున్నాడో చెప్పడానికి ఇంతకన్నా నిరద్శనం అవసరమా?  
 
దిక్కులేని హామీలు.. 
ముఖ్యమంత్రి హామీ ఇస్తే అమలవుతుందని అందరూ అనుకుంటారు. కానీ చంద్రబాబు ఏం చేశాడు? గోస్తలి, చంపావతి నదులను అనుసంధానం చేస్తానని, గజపతి నియోజకవర్గానికి నీళ్లిస్తానని సీఎం హోదాలో బంటుమిల్లిలో మీటింగ్‌ పెట్టి మరీ చెప్పాడు. అనుసంధానం జరిగిందా? ఇక్కడ డిగ్రీ కాలేజీ పెడతానన్నాడు. కన్పించిందా? బైపాస్‌ రోడ్డు కావాలని ప్రజలు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. దత్తిరాజేరు మండలంలో 36 గ్రామాలకు తాగు నీరందించేందుకు రూ.23 కోట్ల నాబార్డు నిధులతో 2011లోనే పనులు మొదలయ్యాయి. చంద్రబాబు వచ్చాక ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయని, తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందని ఇక్కడి ప్రజలు చెప్పారు. ఇక్కడి ఎమ్మెల్యే గురించి ప్రజలు చెబుతూ.. ఆయన ఎన్నో హామీలిచ్చాడని, ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. డిగ్రీ కాలేజీ తెస్తానని తేలేదన్నారు. ఇక్కడి హాస్పిటల్‌ దారుణంగా ఉన్నా, రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకోడన్నా.. అని తెలిపారు. అవినీతిలో మాత్రం ఈ ఎమ్మెల్యే చంద్రబాబు దగ్గర తర్ఫీదు పొందాడని ఆవేశంతో అంటున్నారు.

గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట, భూదేవిపేట, లోగిస గ్రామాల్లో రోడ్లు వేయకుండానే వేసినట్టు బిల్లులు కాజేసిన ఘనత ఈ ఎమ్మెల్యేదన్నారు. ఈయన చంపావతి నదిని వదిలిపెట్టడం లేదన్నా.. లోగిస ర్యాంపు నుంచి ప్రొక్లేన్లు పెట్టి ఎడాపెడా ఇసుకను దోచేస్తున్నాడని తెలిపారు. ఓ వైపున ఇసుకను లూటీ చేస్తూ, అడ్డుపడే కూలీలపై కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్లిందని ప్రజలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తున్నానంటున్నాడు. మీకెవరికైనా ఇస్తున్నాడా? ఇక్కడ అంగన్‌వాడీ, ఫీల్డ్‌ అసిస్టెంట్, ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్లలో షిప్ట్‌ ఆపరేటర్ల కింద పనిచేసే పోస్టులను ఒక్కోటి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇక్కడి ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడని చెప్పారు. గడిచిన ఖరీఫ్‌ నుంచి చూస్తే జిల్లాలో ఉన్న 34లో 32 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నా.. 16 మండలాల్లో వర్షపాతం మైనస్‌ 30 శాతంకు వెళ్లినా ఈ ప్రభుత్వం ఏ ఒక్కదాన్నీ కరవు మండలంగా ప్రకటించలేదన్నారు. దమ్మిడీ సాయం కూడా చేయలేదని ఆవేదన వెలిబుచ్చారు.  
 ఎలాంటి నాయకుడు కావాలో మీరే ఆలోచించండి.. 
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూశారు. రైతులు, పేదలు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న పిల్లలకు ఏమాత్రం మేలు జరగని పాలన చూశాం. చంద్రబాబు పాలనలో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవీ ఊడబీకుతున్నాడు. సాక్షరభారతి ఉద్యోగులు నన్ను పాదయాత్రలో కలిశారు. రాష్ట్రంలో వాళ్లు 20 వేల మంది ఉన్నారు. 13 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్లను రోడ్డుమీద నిలబెట్టాడు చంద్రబాబు. ఇంత దారుణమైన పాలన ఆయనది. ఈయన పాలనలో మోసం, అబద్ధాలు, అవినీతి, అధర్మం చూస్తున్నాం. మరో ఆర్నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మీకెలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసేవాడు నాయకుడుగా కావాలా? మీ గుండెల మీద చెయ్యి వేసి సరైన నిర్ణయం తీసుకోండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. నిజాయితీ, విశ్వసనీయత రావాలి. హామీ ఇచ్చి అమలు చేయకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పొస్తుంది. ఆ మార్పు నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

రైతన్నకు తోడుగా ఉంటా.. చిరునవ్వులు తెప్పిస్తా 
– మనందరి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ప్రతీ రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఇందులో భాగంగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తాం.   
– ప్రతి రైతుకు వడ్డీ లేకుండా పంట రుణాలు ఇప్పిస్తాం.   
– మే నెలలోనే ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 అందిస్తాం.    
– రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.  
– పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర కల్పిస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.   
– రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం.    
– పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.   
– మూతపడ్డ సహకార డెయిరీలను పునరుద్ధరిస్తాం. వీటికి పాలు పోసిన రైతన్నలకు లీటరుకు రూ.4 çసబ్సిడీగా ఇస్తాం.   
– అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడిపోతే వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందజేసి తోడుగా ఉంటాం. ఈ రూ.5 లక్షలు ఆ కుటుంబ ఆస్తిగా పరిగణిస్తాం. అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.  
– రైతన్నల వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇస్తాం. 
– ఆక్వా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు విద్యుత్‌ను యూనిట్‌ రూ.1.50కి ఇస్తాం.  
–  ప్రతి నియోజకవర్గంలో అవసరాన్ని బట్టి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్రతి మండలంలో శీతలీకరణ గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం.  

అన్నా.. అక్కా.. అంబులెన్స్‌కు దారివ్వండి 
– జననేత పిలుపునకు వెంటనే స్పందించిన జనం  
ప్రజా సంక్షేమంపై తనకున్న చిత్తశుద్ధిని జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో నొప్పులతో బాధపడుతున్న గర్భిణి ఆటోలో ఆ మార్గంలో రాగా, జగన్‌ స్పందించి సభకు హాజరైనవారందరిని సహకరించాలని కోరారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు క్షతగాత్రుడిని తీసుకువస్తున్న 108 వాహనానికి దారి ఇప్పించారు. తాజాగా బుధవారం గజపతినగరంలో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు రామభద్రపురం నుంచి విజయనగరం వైపు వెళుతున్న మూడు ప్రైవేట్‌ అంబులెన్స్‌లకు మార్గం సుగమం చేయించారు. ‘అన్నా.. అక్కా.. అంబులెన్స్‌లకు దారి ఇవ్వండి’ అంటూ జననేత చేసిన విజ్ఞప్తికి ప్రజలందరూ వెంటనే స్పందించారు. ప్రభుత్వ అంబులెన్స్‌లు ఎలాగూ అందుబాటులో ఉండవు, కనీసం ప్రైవేట్‌ అంబులెన్స్‌లకైనా దారివ్వండన్నా.. అంటూ అదే సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అత్యవసర సమయంలో 108 నంబర్‌కు ఫోన్‌ చేయగానే 20 నిమిషాల్లో కుయ్‌.. కుయ్‌.. అంటూ వచ్చి ప్రాణాలు కాపాడే వాహనం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని, దీంతో ప్రజలు ఆటోలు, ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

వారం రోజులుగా మున్సిపాలిటీల్లో ఎక్కడి దుర్గంధం అక్కడే ఉంది. రాష్ట్రమంతా విష జ్వరాలు. వ్యాధులు ప్రబలుతున్నాయి. 108 పడకేసింది. ఇటువంటి చెత్త పాలనందిస్తున్న వ్యక్తికి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అవార్డు కచ్చితంగా ఇవ్వమని మీ అందరి తరఫున సిఫార్సు చేస్తున్నా.  
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో వచ్చేదేంటో తెలుసా? కరవు. అందుకే ఆయనకు ఉత్తమ కరవు రత్న అనే అవార్డు ఇవ్వొచ్చు. కరవొచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి. కానీ ఈయన మాత్రం ఆదుకోకుండా వెనకడుగు వేస్తాడు. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. అందుకే ఈయనకు కలియుగ కుంభకర్ణ అనే అవార్డు కచ్చితంగా ఇవ్వొచ్చు. ఆయన సీఎం అవుతూనే సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి మూసేయిస్తాడు. అందుకే ఉత్తమ సహకార రంగ ద్రోహి అనే అవార్డు కూడా ఇవ్వొచ్చని సిఫార్సు చేస్తున్నా.  
 
ప్రతిసారీ గెలవాలనుంది.. గుండెల్లో నిలవాలనుంది 
రేపు మన పాలన చంద్రబాబు నాయుడి పాలన కన్నా భిన్నంగా ఉంటుంది. ఆయన వయసు 70 ఏళ్లు. ఆయనకు డబ్బు తప్ప ఎలాంటి ఆశ లేదు. కానీ నాకు 30 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగాలనే ఆశ ఉంది. ప్రతిసారీ గెలవాలనే తలంపుంది. దేవుడి దయవల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల అది జరుగుతుందనే నమ్మకం నాకుంది. అది జరగాలంటే ప్రతి ఇంట్లో మంచి జరగాలి. ప్రతి ఇంటికీ మంచి చేయాలి. ప్రతి రైతన్నకు తోడుగా నిలబడాలి. అలా చేసినప్పుడే నేను చనిపోయిన తర్వాత కూడా నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా పక్కన ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. అందుకే ప్రతి ప్రాజెక్టును రైతన్నల కోసం చిత్తశుద్ధితో పూర్తి చేస్తాను. చంద్రబాబు మాదిరి లంచాల కోసం ఆరాటపడనని చెబుతున్నా. చిక్కటి చిరునవ్వులతో నాకు తోడుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.   

>
మరిన్ని వార్తలు