రంగనాథన్న చేరికతో పార్టీ బలోపేతం : వైఎస్‌ జగన్‌

27 May, 2018 13:04 IST|Sakshi

సాక్షి, జక్కారం (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. టీడీపీ నేత, అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు, ఆయన మద్దతుదారులు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీరెడ్డిలు ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కలుసుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఆయన టీడీపీకి ఇటీవల రాజీనామా చేశారు. ప్రజల కోసం శ్రమిస్తున్న వైఎస్‌ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారని, జననేత పాదయాత్ర రగిలించిన స్ఫూర్తితో పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. 2014-18 కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ సమన్వయకర్తగా రంగనాథరాజు వ్యవహరించారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రంగనాథ్‌ అన్నతో పాటు లక్ష్మీరెడ్డిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. రంగనాథ్‌ అన్న గురించి నాకంటే ఈ జిల్లా ప్రజలకే బాగా తెలుసు. రంగనాథ్‌ అన్న చేరికతో జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరుతుంది. కేవలం వైఎస్సార్‌పీపీలోకే కాదు, మన అందరి గుండెల్లోకి ఆహ్వానించి వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యుడిగా ఆయనను చూసుకుంటాం. ప్రజలకు సేవ చేయాలని వైఎస్సార్‌సీపీలో చేరుతున్న వారికి ఎప్పుడూ పార్టీలోకి ఆహ్వానం ఉంటుంద’ అన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 173వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జక్కారం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద అమిరం చేరుకోగానే జననేత వైఎస్‌ జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మరోవైపు నవరత్నాలు ప్రకటించి, అన్ని వర్గాల వారిని అభివృద్ధిపథంలోకి తెచ్చేందుకు వైఎస్‌ ఇస్తున్న ఆచరణయోగ్యమైన హామీలకు అధికార పార్టీ నేతలు సైతం ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరుతుండటం గమనార్హం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు