-

ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు.. కనీసం రేషన్‌ అయినా ఇస్తారా?

1 Apr, 2019 18:27 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జాబు రావాలి అంటే బాబు రావాలి అన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని మళ్లీ అధికారంలోకి వస్తే కనీసం రేషన్‌ అయినా ఇస్తారా? అంటూ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ.. బాబు వచ్చారు కానీ జాబు రాలేదు.. బాబు వచ్చాక సాక్షర భారత్‌, మధ్యాహ్నా భోజన పథకం, ఆదర్శ రైతు, గోపాల మిత్ర, ఆయుష్‌ ఉద్యోగాలను పీకేశారంటూ చంద్రబాబును విమర్శించారు.

పేదవాడు మూడు వేలు కడుతూ ఉండాలట..
‘2008లో మహానేత  22 ఎకరాలు సేకరించి పేదవారికి ఇళ్లులు కట్టాలని అనుకున్నారు. బాబు అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా లాక్కున్నారు. ప్రస్తుతం అక్కడ అవినీతితో కూడిన ఫ్లాట్లను కట్టారు. ఒక్కో అడుగుకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని ఏ కాంట్రాక్టర్‌ను అడిగినా చెబుతారు. ఫ్లాట్ల పేరుతో చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారు. ప్రతి పేదవాడు ఇరవై యేళ్ల పాటు మూడు వేలు కడుతూ ఉండాలట.. చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ ఫ్లాట్లపై ఉన్న మొత్తం రూ.3లక్షలు మాఫీ చేస్తాం. భీమవరంలో తాగునీటి సమస్య ఉన్నా.. బాబు పట్టించుకోలేదు. గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతున్న రైతుల బాధలు చూశాను. భీమవరం మార్కెట్‌యార్డ్‌ బైపాస్‌రోడ్‌ ఇప్పటికీ పూర్తి కాలేదు’ అంటూ విమర్శించారు.

లోకల్‌ హీరోకు.. సినిమా హీరోకు పోటీ
తుందుర్రులో ఆక్వాఫ్యాక్టరీ వల్ల ప్రజలు కాలుష్య బారిన పడుతున్నారు. ప్రజలు ఆందోళన చేస్తున్నా.. బాబు పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమే. ప్రజలు కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా సినీ యాక్టర్‌ ఏనాడు వారి దగ్గరకు వెళ్లలేదు. ఇక్కడే ఉండే మన లోకల్‌హీరో శీనన్నకు సినిమా హీరోకు మధ్యనే పోటీ. దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు. రెండెకరాల చంద్రబాబు.. దేశంలోనే అత్యంత ధనిక సీఎం అంటే రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చ’న్నారు.

జాబు రావాలి అంటే బాబు పోవాలి
‘దేశంలోనే అత్యంత పేదవాడు ఎవరంటే మన రైతేనని నాబార్డ్‌నివేదికలు చెబుతున్నాయి. ఐదేళ్లలో నిరుద్యోగం రెట్టింపు అయింది. జాబు రావాలంటే.. బాబు పోవాలి. జాబు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు వచ్చాడు.. ఉన్న ఉద్యోగాలు పోయాయి. లక్షా ఇరవై వేల మందికి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్ట్‌ కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఎయిడెడ్‌ ఉద్యోగస్తులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. సీపీఎస్‌ నిధులను వాడుకున్నారు. పోలీసులకు టీఏ, డీఏలు బంద్‌ అయ్యాయి. మళ్లీ పొరపాటున బాబుకు ఓటేస్తే.. రేషన్‌ అయినా ఇస్తారా?’ అంటూ బాబుపై నిప్పులు చెరిగారు.

అధికారంలోకి రాగానే గ్రామ సెక్రటేరియేట్‌..
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిగ్రామంలో సెక్రటేరియేట్‌ ఏర్పాటు చేస్తాం. ఆ గ్రామంలోని పదిమందికి ఉద్యోగాలిస్తాం. మీకు ఏ సంక్షేమ పథకం కావాలన్నా దరఖాస్తు చేసుకున్న.. 72గంటల్లో మీకు అందేలా చేస్తాం. కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అందరికీ అందేలా చేస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. గ్రామ వాలంటీర్‌కు ఐదు వేల గౌరవ వేతనం ఇస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ యాభై ఇళ్లకు అందేలా వారు చూస్తారు.  రాష్ట్రంలో మొత్తం 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే.. మొత్తం ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ కాలెండర్‌ను రిలీజ్‌ చేస్తామ’ని హామీ ఇచ్చారు.

ఆర్టీసీలోని ప్రతి కాంట్రాక్ట్‌ను నిరుద్యోగ యువతకే ఇస్తామన్నారు. సెల్ప్‌ ఎంప్లాయిమెంట్‌ కింద కారు కొనుక్కోవాలంటే సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై ఎవరు సంతకం పెడతారో.. వారికే మద్దతిస్తామని.. హోదా వస్తే.. ఇన్‌కమ్‌ట్యాక్స్‌, జీఎస్టీలు కట్టాల్సిన అవసరం లేదన్నారు. దీంతో పరిశ్రమలు, ఆస్పత్రులు సహా అన్నీ ఇక్కడికే వస్తాయన్నారు. హోదా వస్తే ఏపీలోని ప్రతి జిల్లా హైదరబాద్‌ అవుతుందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులైన గ్రంథి శ్రీనివాస్‌, రఘురామ కృష్ణంరాజును గెలిపించాలని, ఫ్యాను గుర్తుకే ఓటెయ్యాలని ప్రజలను కోరుతూ జననేత తన ప్రసంగాన్ని ముగించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు