ప్రభంజనం.. ప్రజా సంకల్పం 

14 May, 2018 03:28 IST|Sakshi
బనగానపల్లెలో అశేష జనవాహిని మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌

     జిల్లా జిల్లాకు జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ 

     ‘హోదా’ను ప్రజల ఎజెండాగా మలిచిన జననేత 

     హోదా దెబ్బకు కదులుతున్న చంద్రబాబు పీఠం 

     బాబు వైఫల్యాలను తూర్పారబట్టడంలో విజయం 

     సర్వత్రా ప్రశంసలు.. ఇతర పార్టీల నుంచి చేరికలు 

     నేడు 2000 కి.మీ అధిగమించనున్న పాదయాత్ర  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘నేను చేయ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో చంద్రబాబు పీఠం కదిలి పోవాలి.. ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ప్రారంభించడానికి ముందు 175 నియోజకవర్గాల సమన్వయకర్తలకు చెప్పిన మాటలు నేడు అక్షరాలా నిజమయ్యే పరిస్థితులు రాష్ట్రంలో క్రమంగా నెలకొంటున్నాయి. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆశీస్సులు పొంది నవంబర్‌ 6వ తేదీన జగన్‌ ప్రారంభించిన పాదయాత్రలో ఒక్కొక్క అడుగూ ముందుకు వేసే కొద్దీ దాని ప్రభావం రాష్ట్రంలో ఓ ప్రభంజనంగా మారి అధికార పక్షాన్ని కలవర పెడుతోంది. పరిశీలకులు, విశ్లేషకులను సైతం అబ్బుర పరిచే విధంగా ముందుకు సాగుతోంది. 2000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో జగన్‌ పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో మరింత విశ్వాసం, మరింత నమ్మకాన్ని కల్పించడంతో పాటు భరోసాను ఇవ్వడంలో జగన్‌ విజయం సాధించారని విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. 2000 కిలోమీటర్ల ఈ ప్రస్థానంలో జగన్‌ అడుగు పెట్టిన చోటల్లా రాజకీయాలు జిల్లా కొక మలుపు తిరుగుతూండటం అధికార పక్షాన్ని బాగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. జగన్‌ తన యాత్రలో ప్రజా సమస్యలు వినడంలో తలమునకలవుతూనే రాష్ట్ర ప్రజలకు ఏవి అవసరమో వాటిపై దృష్టి సారించారు. స్థానికంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పడం ద్వారా వారికి భరోసానిచ్చారు. విభజన వల్ల అన్ని విధాలా అన్యాయమైన ఏపీకి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని అని తొలి నుంచీ విశ్వసిస్తూ.. ప్రజల్లో ఆకాంక్షను రగిలిస్తూ వచ్చిన జగన్‌ తన పాదయాత్రలో ఉంటూనే ఇదే అంశంపై తిరుగులేని ఎజెండాను అందరి ముందూ ఉంచగలిగారు. 

 అందరినీ హోదా బాట పట్టించారు.. 
‘హోదాతో ఏం ప్రయోజనం...’ అన్న వారే తామూ ప్రత్యేక హోదా కావాలనే స్థాయికి తీసుకు రాగలిగారు. తామూ హోదా కోసం ‘పోరాటం’ చేస్తున్నామని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రత్యర్థులకు కలిగించారు. ఇది స్పష్టంగా జగన్‌ సాధించిన విజయమేనని చెప్పాలి. అవిశ్వాస తీర్మానం మేం పెడతాం, మీరు మద్దతిస్తారా? లేక మీరు పెట్టినా మేం మద్దతిస్తాం అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై చంద్రబాబు గింజుకుంటూ ఉండగానే తానే తన ఎంపీలతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పించి చివరకు టీడీపీ కూడా అదే బాటలో పయనించేలా చేశారు. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో టీడీపీ తెగదెంపులు చేసుకుని తన మంత్రుల్ని సైతం కేబినెట్‌ నుంచి వైదొలిగేలా చేయగలిగారు. వాస్తవానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోతే కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారని ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్న జగన్‌ దెబ్బకు చంద్రబాబు హోదాపై యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది.  

స్పష్టమైన కార్యాచరణతో పెరిగిన సానుకూలత 
ఎన్నికల హామీలు నెరవేర్చలేని చంద్రబాబు మోసాలకు బలైన ప్రజలు ఆయనపై వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని, వ్యతిరేకతను జగన్‌ గ్రహించి జాగ్రత్తగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రావడానికి అవసరమైన చర్యలను కూడా (కార్యాచరణను) యాత్రలో ఉండగానే చేపట్టారు. ఈ కార్యాచరణలో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తానని, కొత్త పరిశ్రమల్లో 75 శాతం మంది ఉద్యోగాలను స్థానికులకే ఇస్తానని ప్రకటించడంతో పాటు, ప్రతి కులంలోనూ ఉన్న పేదవారిని ఆదుకునేందుకు, వారి విద్యా వికాసం కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తానని పలు హామీలు ఇచ్చి ప్రజల మద్దతు పొందగలిగారు. పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజునే సీపీఎస్‌ ఉద్యోగులకు ఆ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జగన్‌ ప్రసంగాలు జనంలో గట్టి నమ్మకాన్ని కలిగించాయని చెప్పక తప్పదు. నాలుగేళ్లయినా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని నిలదీస్తూనే రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయక పోవడాన్ని గట్టిగా చాటి చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో వివిధ వర్గాల కోసం పొందు పర్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేసిన మోసాలను, చంద్రబాబు అవినీతిని పదే పదే జగన్‌ తన సభల్లో ప్రజలకు తెలియజేశారు. ఈ పరిణామాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో క్రమంగా సానుకూల వాతావరణం కలుగడానికి కారణం అవుతున్నాయి. 

పోటెత్తుతున్న జనవాహిని: ఇడుపులపాయలో యాత్ర ప్రారంభమైన రోజు నుంచీ భారీగా జనం పోటెత్తుతున్నారు. జగన్‌ ప్రసంగించే సభలకైతే వెల్లువలా జనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలేమీ లేకపోయినా, రాజకీయ వాతావరణం అంతగా ఇంకా వేడెక్కక పోయినా తండోపతండోలుగా జనం రావడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వారెంత వ్యతిరేకతతో ఉన్నారో ఇట్టే అర్థం అవుతోంది. ఎన్నికలు సమీపించినప్పుడు పార్టీలు మారడం సహజం. కానీ జగన్‌ పాదయాత్ర సాగించిన జిల్లాల్లో అక్కడి ప్రముఖ నేతలు ఆయన సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు యలమంచిలి రవి, రాజా కన్నబాబు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వంటి వారు చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా ఉండిన జిల్లాల్లో సైతం కింది స్థాయిలో ఇతర పార్టీల కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల ఆకర్షితులవుతున్నారు. టీడీపీ తమకు బలంగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్న జిల్లాల్లో కూడా కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలు జారి పోకుండా నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అలాగే జగన్‌ యాత్ర ఒక జిల్లా నుంచి మరో జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించేటప్పుడు కూడా ఆయనకు జనం స్వాగతం పలికిన తీరు చరిత్రలో ఒక రికార్డు అని భావిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి రాళ్లపాడు రిజర్వాయర్‌ మీదుగా ప్రకాశం జిల్లాలో ప్రవేశించేటప్పుడు, ప్రకాశం సరిహద్దు నుంచి గుంటూరులోకి.. గుంటూరు నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలో ప్రవేశించేటపుడు అంచనాలకు మించి జనం వచ్చారు. ఓ దశలో కనకదుర్గమ్మ వారధి ప్రకంపించిందంటే జనాదరణ ఎంతగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.   

పార్టీలో కింది స్థాయి నుంచీ క్రియాశీలత 
తాను ఓవైపు పాదయాత్ర చేస్తున్నా... జిల్లాల్లో ఏ మాత్రం పార్టీ ఊపు తగ్గకుండా వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు నిర్దిష్టమైన రీతిలో ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు కూడా చేయించారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరిగిన నిరసనలు, దీక్షలు, బంద్‌లు మొదలు.. మహిళల రక్షణలో చంద్రబాబు సర్కారు వైఫల్యం చెందిన తీరుపై నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీల వంటి వాటిలో పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయడంలో జగన్‌ మరింతగా విజయవంతం అయ్యారు. జగన్‌ ఏ పిలుపు ఇచ్చినా కార్యకర్తలు కదం తొక్కారు. 

మరిన్ని వార్తలు