ఉచిత ఆపరేషన్‌.. భారీగా పెన్షన్‌

21 Nov, 2017 17:01 IST|Sakshi

కిడ్నీ రీప్లేస్‌మెంట్‌కు ఉచితంగా ఆపరేషన్లు

కిడ్నీ రోగులకు నెలకు రూ. 10 వేలు పెన్షన్‌

బేతంచర్ల సభలో వైఎస్‌ జగన్ హామీ

సాక్షి, బేతంచర్ల: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగింస్తూ.. ఆరోగ్యశ్రీని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థను మారుస్తామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేస్తామని హామీయిచ్చారు. 104, 108 సేవలను మెరుగు పరుస్తామని హామీయిచ్చారు. 108కి ఫోన్‌ చేయగానే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేట్టు చేస్తామన్నారు.

‘ఏ ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తా. చిరునవ్వుతో ఇంటికి పంపిస్తా. మూగ, చెవుడు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. కేన్సర్‌, గుండె, న్యూరో సమస్యలకు కూడా ఉచితం ఆపరేషన్లు చేయిస్తాం. కిడ్నీ రీప్లేస్‌మెంట్‌కు ఉచితంగా ఆపరేషన్లు చేయించడంతో పాటు శస్త్రచికిత్స సమయంలో అవసరమైతే కొంత డబ్బు ఇచ్చి బాధితులను ఆదుకుంటాం. కిడ్నీ రోగులకు అన్నిరకాలు తోడుగా ఉంటాం. వారికి నెలకు రూ. 10 వేలు పెన్షన్‌గా ఇస్తాం. 104 ద్వారా అన్నిరకాల మందులు ఇస్తాం. మీ అమూల్యమైన సూచనలు, సలహాలతో రెండుమూడు పేజీల్లో మేనిఫెస్టో తీసుకొచ్చి అందులోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామ’ని వైఎస్‌ జగన్‌ భరోసాయిచ్చారు.

భ్రష్టు పట్టిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను మారుస్తాం

మరిన్ని వార్తలు