జగనన్నతో మా కుటుంబానికి కొండంత భరోసా.. 

9 Apr, 2019 10:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు తమ జీవితాల్లో వెలుగులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి పాలనకు చరమగీతం పాడాలని కోరుకుంటున్నారు. జగనన్నతోనే రాజన్న ఆశయాలు నెరవేరతాయి. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటంతో పాటు కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు వస్తుందని ఆనందం వెలిబుచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు, రైతులకు పంట మొదట్లోనే మద్దతు ధర ప్రకటించడం లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 

‘నవరత్నాలు’తో మా బతుకుల్లో వెలుగు  

ఉరవకొండ: నేను, నా భర్త రోజూ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాం. కూలి డబ్బుతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. అయితే వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో మా కష్టాలన్నీ తీరతాయన్న నమ్మకం కలుగుతోంది. మా అత్తకు మూడు వేల రూపాయల పింఛన్‌ ఇస్తారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు. డ్వాక్రాలో నాకు రూ.60 వేల అప్పు ఉంది. ఈ అప్పునంతా నాలుగు దఫాల్లో నా చేతికే ఇస్తారు. నా పిల్లల్ని బడికి పంపితే ఏటా రూ.15 వేలు ఇస్తారు. మాకు పక్కా ఇల్లు కూడా కట్టించి.. ఆ ఇంటిని నా పేర్న రిజిస్టర్‌ చేస్తారు. మాకు ఎప్పుడన్నా డబ్బులు అవసరమైతే ఆ ఇంటి కాగితాల్ని బ్యాంకులో కుదువపెట్టి రుణం తీసుకునే వెసులుబాటు కలిగిస్తానని చెప్పారు. జగన్‌ సీఎం అయితే మా కుటుంబానికి లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. మా కష్టాలన్నీ తీరతాయి.  
– కురుబ లక్ష్మీదేవి, ఉరవకొండ, అనంతపురం జిల్లా

జగనన్నతోనే మా దశ తిరుగుతుంది

ఉలవపాడు: నేను ఉలవపాడు బస్టాండ్‌ సెంటర్‌లో పూలబండి పెట్టుకుని పూలు అమ్ముకుంటాను. జగన్‌ సీఎం అయితే నాకు పింఛన్‌ రూ.3 వేలు ఇస్తారు. మా అమ్మాయికి 45 ఏళ్లు దాటాయి. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అందించే వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు విడతలుగా రూ.75 వేలు వస్తాయి. ఎంబీఏ చదివిన నా మనువడు శివశంకర్‌ నిరుద్యోగిగా ఉన్నాడు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలన్నీ ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం చేస్తానని మాట ఇచ్చాడు. దీంతో నా మనుమడికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నాం. ఇంకో మనుమడు సాయికిరణ్, మనుమరాలు కామాక్షి చదువులకు ఫీజు రీయింబర్స్‌ అవుతుంది. సొంతిల్లు లేని మాకు జగన్‌ ఇల్లు కట్టిస్తానన్నారు.  తోపుడు బండ్లు ఉన్న వారికి వడ్డీ లేకుండా రూ.10 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. జగన్‌ ఇచ్చిన హామీల వల్ల మా కుటుంబ దశ మారుతుందని ఆశిస్తున్నాం. 
– అరవ నాగరత్నమ్మ, ఉలవపాడు, ప్రకాశం జిల్లా

మా కుటుంబానికి కొండంత భరోసా 

నెల్లిమర్ల: వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తానని చెప్పారు. వీటి ద్వారా మా కుటుంబానికి లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. మా నాన్నకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తారు. కుటుంబంలోని అందరికీ ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది. మా పాపను బడికి పంపినందుకు గాను అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తారు. నా భార్య డ్వాక్రా సభ్యురాలు. ఆమెకు సున్నా వడ్డీతో రుణం అందుతుంది. అంతేగాకుండా మాకు పక్కా ఇల్లు కట్టిస్తారు. ఇలా మా కుటుంబానికి లక్షల్లో ప్రయోజనం కలుగుతుంది. 
– బొందిలి రవీంద్రకుమార్‌సింగ్, నెల్లిమర్ల, విజయనగరం

మా కష్టాలన్నీ తీరతాయి

కోట:  వైఎస్‌ జగన్‌ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి. రైతునైన నాకు నవరత్నాల్లోని వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు వస్తాయి. పంట నష్టపోతే పరిహారం కూడా ఇస్తామని జగన్‌ చెప్పారు. అంతేకాదు వడ్డీలేని రుణం ఇస్తారు. మాకు పొలంలో బోరు వేయడం ద్వారా లక్ష వరకూ ప్రయోజనం కలుగుతుంది. మా అమ్మ అంకమ్మకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తారు. వ్యాధి ఏదైనా చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తుంది. నా భార్యకు డ్వాక్రా అప్పు రూ.70 వేలు ఉంది. ఆ మొత్తాన్ని నాలుగు దఫాల్లో మా చేతికే ఇస్తారు. బడికి వెళుతున్న మా ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తాయి. మా పిల్లల ఉన్నత చదువులకు ఎంత ఖర్చయినా ఫీజు రీయింబర్స్‌ అవుతుంది. 
వైఎస్‌ జగన్‌ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి.   
– దార్ల కోటేశ్వరరావు, మద్దాలి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

 మా కుటుంబానికి ఎంతో ప్రయోజనం 

బుట్టాయగూడెం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. నా కుమారుడిని బడికి పంపినందుకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. 
నాకు డ్వాక్రాలో రూ.80 వేల అప్పు ఉంది. ఈ అప్పునకు సంబంధించిన నగదు మొత్తం నాలుగు విడతల్లో నా చేతికే ఇస్తారు.  గిరిజన మహిళనైన నాకు ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ పథకం మా గిరిజనుల పాలిట వరం. ఎప్పుడూ విషజ్వరాలతో తల్లడిల్లుతున్న మా గిరిజన ప్రాంతాలకు ఈ పథకం ఆసరాగా ఉంటుంది. 
– తెల్లం రమణ, తూర్పురేగులకుంట గిరిజన గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా 

మరిన్ని వార్తలు