చంద్రబాబు రైతులను వారికి అమ్మేశాడు: వైఎస్‌ జగన్‌

25 Nov, 2017 17:33 IST|Sakshi

సాక్షి, కృష్ణగిరి (కర్నూలు): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కృష్ణగిరి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తాము ఏ విధంగా కష్టాలు పడుతున్నామో వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం వల్ల తమకు ఏమాత్రం మేలు జరగలేదని, ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన దారుణంగా ఉందని, కంది, మినుము, వేరుశనగ, మిర్చి, పత్తి.. ఇలా ఒక్క పంటకూ గిట్టుబాటు కల్పించడం లేదని మండిపడ్డారు. రైతుల కోసం రూ. వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక రైతులనే దళారులకు అమ్మేశాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఒక దళారి కావడం వల్లే రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, బాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థ రైతుల నుంచి తక్కువ ధర కొనుగోలుచేసి.. ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్మకుంటున్నారని అన్నారు. మిగతా దళారులు సైతం రైతుల నుంచి తక్కువ ధరకు కొని.. ఆ తర్వాత అమాంతం ధర పెంచుతున్నారని వివరించారు. చంద్రబాబు ఇదే దళారి వ్యవస్థకు మద్దతిస్తూ.. దళారిగా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. గత నాలుగేళ్లుగా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఏ ఒక్క హామీనైనా నేరవెరిందా..!

  • నాలుగేళ్ల తన పాలనలో చంద్రబాబు ప్రజలను అన్నివిధాలుగా మోసంచేస్తున్నాడు
  • ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారని చెప్పగలరా? లేదు
  • నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు
  • దారిపొడవునా అవ్వాతాతలు, వికలాంగులు నన్ను కలిసి.. పెన్షన్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
  • జన్మభూమి కమిటీ పేరిట చంద్రబాబు మాఫియాను నడుపుతున్నారు
  • పెన్షన్‌, రేషన్‌, ఇల్లు ఇలా ఏది కావాలన్నా లంచాలు ఇస్తేనే పని జరుగుతోంది
  • ఇంతకుముందు రేషన్‌ షాపులో అన్ని రకాల వస్తువులు దొరికేవి
  • ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక బియ్యం తప్పా ఏమీ దొరకడం లేదు
  • ఇప్పుడు కరెంటు బిల్లు విపరీతంగా వస్తోంది
  • బాబు సీఎం అయ్యాక కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి
  • వేరుశనగ నుంచి పత్తి వరకు రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు
  • ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు
  • ఈ నాలుగేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టించారా?
  • పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు
  • ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు
  • బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు
  • వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని అన్నాడు
  • కానీ బ్యాంకుల్లో బంగారం ఈరోజు ఇంటికి వచ్చిందా? రాలేదు. రుణమాఫీ కూడా అమలుకాలేదు
  • చంద్రబాబు చేసిన రుణమాఫీ పథకం రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదు

ఉపాధి హామీ.. అవినీతి కంపు కొడుతోంది!

  • ఉపాధి హామీ పనులను బాబు టీడీపీ అవినీతి పనులుగా మారిపోయాయి
  • ఉపాధి హామీ పథకం అవినీతి కంపు కొడుతోంది
  • దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో ఉపాధి హామీ నిధుల్లో 95శాతం కూలీల కోసం కేటాయించారు
  • దీంతో అందరికీ పనులు దొరికేవి
  • ఇప్పుడు ఉపాధి హామీ పనుల కోసం ప్రొక్లెయినర్లు పెట్టి.. పందికొక్కుల్లా దోచుకుంటున్నారు
  • కూలీలతో చేయించాల్సిన పనులు.. జేసీబీ, ప్రొక్లెయినర్లతో చేయిస్తున్నారు
  • ఉపాధి హామీ పథకంలో చంద్రబాబు తీరు చూసి కేంద్రం కూడా భయపడుతోంది

వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి..!

  • చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశాం.. ఇలాంటి నాయకుడు మనకు కావాలా? వద్దేవద్దు..
  • ఇటువంటి అన్యాయమైన వ్యక్తి, మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తిని తిరిగి కావాలనుకుంటే..
    రేపొద్దున్న మళ్లీ ప్రజలను మోసం చేస్తాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి ఒక మారుతి కారు ఇస్తానంటాడు
  • రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం తీసుకురావాలి
  • ప్రజలకు ఏదైనా మాట ఇచ్చి.. అది చేయలేకపోయినప్పుడు.. పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి
  • చంద్రబాబు చేస్తున్న రాజకీయాలతో ఈ వ్యవస్థలోని కంపు భరించలేక.. .ప్రజలు ముక్కు మూసుకుంటున్నారు
  • ఉదయంలేస్తే చంద్రబాబు లంచాలు, కలెక్షన్ల గురించి ఆలోచిస్తాడు
  • లంచాలతో సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను ఎలా కొనాలి.. వ్యవస్థను ఎలా మేనేజ్‌ చేసుకోవాలి అని ఆలోచిస్తాడు
  • ఒక్క సంవత్సరం ఓపిక పడుద్దాం. దేవుడి ఆశీస్సులు.. మీ అందరి దీవెనలతో రేప్పొద్దున మనందరి ప్రభుత్వం వస్తుంది
  • ప్రతి పేదవాడికి, పొదుపు సంఘాల మహిళలకు, ఉపాధి హామీ కూలీలకు.. ప్రతి అక్కా చెల్లెమ్మకు మేలు జరుగుతుంది
  • మీ చిన్నపిల్లలను బడులకు పంపించండి. బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు ఇస్తాం. 
  • మన బతుకులు మారాలంటే ఆ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి.
  • మనం ప్రభుత్వం వచ్చాక నెలవారీ పెన్షన్‌ను రెండువేలుకు పెంచుతాం. ఎస్సీలు, బీసీలు, ఎస్టీల పెన్షన్‌ వయస్సు 45 ఏళ్లకు తగ్గిస్తాం
  • పొదుపు సంఘాల్లోని మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. 
  • నవరత్నాలు ప్రకటించాం.. నవరత్నాలను మరింత మెరుగుపరిచేందుకు మీరు సూచనలు, సలహాలు ఇవ్వండి
  • ఒక సంవత్సరం ఓపిగ్గా పట్టండి. మనందరి ప్రభుత్వం వస్తుంది. మనందరికీ మేలు చేస్తుంది

కృష్ణగిరిలో వైఎస్‌ జగన్‌తో తమ గోడు చెప్పుకున్న ప్రజలు
డిగ్రీ చేసినా ఉద్యోగం ఇవ్వలేదు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. జాబూ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగం లేకపోవడంతో ఇంటివద్ద ఖాళీగా ఉన్నను. వ్యవసాయ రుణాలు రూపాయి కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు డబ్బు వేస్తేనే కదా మేం రుణాలు మాఫీ చేసేది. చంద్రబాబే వేయనిది ఎలా ఇచ్చేది అనిబ్యాంకులు అంటున్నాయి. జగన్‌కే ఓటు వేద్దాం.. జగన్‌నే గెలిపిద్దాం- ఓ విద్యార్థిని వ్యాఖ్య

ఉపాధి హామీ దొరకడం లేదు
ఉపాధి  హామీ పనులు జరగడం లేదు. చంద్రబాబు ఎలాంటి పనులు చేయడం లేదు. జరిగిన దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. నాలుగు నెలల నుంచి ఉపాధి హామీ కూలీలు బాకీ ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాకు మరుగుదొడ్లు కట్టివ్వడంలేదు- ఓ మహిళ ఆవేదన


కరువు పనికి వెళ్లినా డబ్బు ఇవ్వడం లేదు. పనిచేసినా ఒక్కరూపాయి రాలేదు. ఒక్కొరికి పది వేలు ఇస్తానని ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. పొదుపు సంఘాల డబ్బులు రావడం లేదు. పొదుపురుణాలను మాఫీ చేయలేదు. చంద్రబాబు ఏమీ చేయడని బ్యాంకులో బంగారం పెట్టలేదు. మా అప్పులు మేమే కట్టుకున్నాం- ఓ బడుగు మహిళ గోడు

వేరుశనగ పంట వేశాం.. మూడు నాలుగు క్వింటాళ్లు వచ్చింది. గిట్టుబాటు ధర రావడం లేదు. గిట్టుబాటు ధర రూ. 2,400 కూడా దాటడం లేదు. ఒక్క ఎకరకు పదివేలు వరకు ఖర్చు చేశాం. అప్పులు ఎలా తీర్చాలి. ఎలా బతకాలి- ఓ మహిళా రైతు ఆవేదన

మరిన్ని వార్తలు