గిట్టుబాటు ధర ముందే ప్రకటిస్తాం : సీఎం జగన్‌

10 Dec, 2019 16:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో రైతు భరోసాపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  చంద్రబాబులా మోసం చేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. రైతుల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రభుత్వం తమదని తెలిపారు. పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ఏ పంటకు ఎంత రేటో గురువారం పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 960 కోట్లను తాము చెల్లించామని తెలిపారు. 



బ్యాంక్‌లు రైతులకు లోన్‌లు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు : బుగ్గన
టీడీపీ హయాంలో ఎంత రుణమాఫీ చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళవారం రోజున అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులను మభ్యపెట్టారని తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో రకాలుగా హడావుడి చేశారని చెప్పారు. గత ప్రభుత్వం బ్యాంక్‌లు రైతులకు లోన్‌లు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డిస్కమ్‌ నిధులు వాడారని మండిపడ్డారు. 

కష్టం వస్తే నేనున్నానని చెప్పే సీఎం వైఎస్‌ జగన్‌ : కన్నబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్క కౌలు రైతుకైనా మేలు చేశారా అని ప్రశ్నించారు. కౌలు రైతులకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. ఒక్క గింజ ధాన్యం కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు. చంద్రబాబుకు వ్యవసాయం గురించి ఏమి తెలియదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీకి చంద్రన్న దగా అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. కష్టం వస్తే నేనున్నానని చెప్పే సీఎం వైఎస్‌ జగన్‌ అని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం అద్భుతంగా జరుగుతోందని చెప్పారు. చంద్రబాబు ప్రతి ఒక్క రైతును మోసం చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు విఫలం కావడంతోనే ప్రజలు సరైన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 

మరిన్ని వార్తలు