‘బాబుకు ఓటేస్తే.. రూ.5 లక్షలు కట్టాల్సి వస్తుంది’

30 Mar, 2019 18:12 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీ, కరెంట్‌ అన్నీ ప్రైవేట్‌ మయం

జన్మభూమి కమిటీలదే రాజ్యం.. 

బాబును నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే

సోమందేపల్లి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ 

సాక్షి, సోమందేపల్లి(అనంతపురం) : ‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. ఇంజనీరింగ్‌కు రూ. 5లక్షల ఫీజు కట్టాల్సివస్తుంది. ఎల్‌కేజీకి కూడా లక్ష కట్టాల్సి వస్తుంది. ఒక్క ప్రభుత్వ స్కూల్‌ కూడా ఉండదు. ఇప్పటికే 6వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలంటే రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. పించన్లు, రేషన్‌ కార్డులు తీసేస్తారు. ఆరోగ్య శ్రీ అటకెక్కుతుంది.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టేనన్నారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శంకర్‌ నారాయణ, హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

రాజస్తాన్‌ తర్వాత..
రాజస్తాన్‌ తర్వాత అనంతపురం జిల్లాలోనే కరువు ఎక్కువ. గొల్లపల్లి రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైఎస్సారే. నాన్నగారి హయాంలో హంద్రీనీవా 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. తాగడానికి నీళ్లు లేవని తెలిసినా చంద్రబాబు చేసిందేమి లేదు.. ఇసుకను మాత్రం యధేచ్చగా దోచేస్తున్నారు. పెనుకొండ, గోరంట్ల మండల్లాలో వేల ఎకరాల భూమిని సేకరించింది. ఇ‍క్కడ ఒక్క పరిశ్రమనైనా వచ్చిందా? కియా మోటర్స్‌తో చంద్రబాబు చేసిన స్కాంలు ఇన్ని అన్నీ కావు. రైతుల నుంచి కారు చౌకగా భూములను కొని చదునుగా ఉన్న భూమిని మళ్లీ చదును చేసేందుకు రూ. 650 కోట్లకు ఎల్‌అండ్‌టీ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ ఎల్‌అండ్‌టీ సంస్థనే మళ్లీ రూ.177 కోట్లకు తెలగుదేశం నాయకులకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే వీళ్లు పాలకులా లేఖ రాక్షసులా? అనిపిస్తోంది. టీడీపీ కమీషన్ల దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. రైతు, డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకాలను ఎగ్గొట్టారు. ప్రతికులాన్ని వెన్నుపోటు పొడిచి చరిత్ర చంద్రబాబుది.

చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు. ఆర్టీసీ, కరెంట్‌ కూడా మిగల్చడు.. అన్నీ ప్రయివేట్‌ పరం చేస్తాడు. కరెంట్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు కుదించేశాడు. ఇప్పుడిస్తున్న పెన్షన్లను కూడా మళ్లీ అధికారంలోకి రాగానే తగ్గించేస్తాడు. భూములు లాగేస్తాడు. ఇప్పటికే వెబ్‌ ల్యాండ్‌ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూమలు లాగేస్తున్నాడు. పొరపాటున బాబు అధికారంలోకి వస్తే.. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవు.

జన్మభూమి కమిటీలదే రాజ్యం..
పొరపాటున చంద్రబాబుకు ఒటేస్తే.. మీరు ఏ సినిమా, టీవీ చానెల్‌ చూడాలన్నా.. ఏ పేపర్‌ చదవాలన్నా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా వారే చెబుతారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్ధానాలు.. పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తాడు.  చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని కోరుతున్నా. 1994 ఎన్నికల ముందు మద్యపాన నిషేదం.. కిలో రెండు రూపాయల బియ్యమని చెప్పి.. ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో మద్యపాన నిషేధం ఎత్తేశారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25 చేశారు. ఇదే పెద్దమనిషి మళ్లీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచేస్తాడు. సున్నా వడ్డీ రుణాలుండవ్‌. రైతులకు రుణాలే ఇవ్వరు. ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది.. ఇంకా పూర్తిగా లేకుండా పోతుంది. 108,104లు కనుమరుగవుతాయి.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అటకెక్కుతుంది. ఫీజులు ఆకాశానికి పడుగెత్తుతాయి. చంద్రబాబును వ్యతిరేకించే వారిని ఎవ్వరిని బతుకనివ్వరు. గ్రామం నుంచి రాజధాని వరకు తన పోలీసులే కాబట్టి కేసులు ఉండవు. సీబీఐ, సీఐడీని రానివ్వరు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపొయ్యాయి. చనిపోయినా ఒక్క వార్త రాదు. వారే చంపించి పైగా బాధిత కుటుంబంపై నెట్టేస్తారు.

జడ్జీలుగా బీసీలకు అవకాశం ఇస్తే.. బీసీలు జడ్జి పదవులకు అనర్హులని చంద్రబాబు లేఖలు రాశారు. గోరంట్ల మాధవ్‌ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. ఆయనను ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు తాను చేసిన రాజీనామాను ఆమోదించకుండా చంద్రబాబు అడ్డుతగిలారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగానే, సింగిల్‌ విండో ఆఫీస్‌ ముందే.. మనకు హత్యలు కనిపిస్తున్నాయి. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఎలా ఉంటుందో చంద్రబాబును నమ్మితే అలా ఉంటుంది.

అన్న ఉన్నాడని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

మరిన్ని వార్తలు